

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పసిడి పోరుకు అర్హత సాధించింది. తద్వారా ఆసియా గేమ్స్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు మరో చరిత్ర సృష్టించింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
ఇప్పటి వరకూ ఆసియా గేమ్స్‌లో అటు మహిళల్లో గానీ, ఇటు పురుషుల్లో గానీ సింగిల్స్‌లో ఎవరూ ఫైనల్‌కు చేరక పోవడం విశేషం. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్‌కు ఇప్పటి వరకూ ఒకే ఒక్క సింగిల్స్ పతకం ఉంది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియాడ్‌లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్ మోడీ కాంస్య పతకం గెలిచాడు.
ఆ తర్వాత సింగిల్స్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా రాలేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా గేమ్స్ మహిళల సింగిల్స్‌లో భారత్‌కు ఆదివారమే రెండు పతకాలు ఖాయమయ్యాయి. అయితే, సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓడిన సైనా నెహ్వాల్ కాంస్యంతో సరిపెట్టుకుంది.
ఆ తర్వాత మహిళల సింగిల్స్ రెండో సెమీ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు 21-17, 15-21, 21-10 తేడాతో రెండో ర్యాంకర్ యామగూచి(జపాన్)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో రజత పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు, స్వర్ణ పతక పోరుకు సిద్ధమైంది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సింధు.. చిన్నపాటి తప్పిదాలతో రెండో గేమ్‌ను కోల్పోయింది.
ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు అద్భుత ప్రదర్శన చేసింది. సుదీర్ఘమైన ర్యాలీతో ఆకట్టుకున్న యామగూచిపై పీవీ సింధు తన అనుభవాన్ని ఉపయోగించి ఓడించింది. మూడో గేమ్‌లో యమగూచి కాస్త అలసటగా కనిపించింది. కానీ, సింధు ఏమాత్రం అలసిపోకుండా బలమైన షాట్లు కొడుతూ 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
మంగళవారం స్వర్ణం కోసం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పీవీ సింధు ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్ తైపీ)తో తలపడనుంది. ఇప్పటివరకు ఈ ఇద్దరూ 12 సార్లు తలపడగా తై జు యింగ్ అత్యధికంగా 9 సార్లు విజయం సాధించింది. రియో ఒలింపిక్స్‌లో తైజుని ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం విశేషం.