హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటీ పడడంతో రియో ఒలింపిక్స్ వెండి పతకం విజేత పివి సింధు పంట పడింది. ఇరు రాష్ట్రాలు ఆమెను సొంతం చేసుకోవడానికి పోటీ పడ్డాయి. ఆమెకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా వివిధ రూపాల్లో ప్రకటించిన అవార్డుల విలువ 13 కోట్ల రూపాయలపైనే ఉంటుంది.
రెండు రాష్ట్రాల్లోనూ ఆమెకు అత్యంత వైభవంగా సత్కారాలు జరిగాయి. ఆమె కోచ్ గోపీచంద్ కూడా ఇరు రాష్ట్రాల నుంచి ప్రయోజనం పొందారు. ఆయనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను కూడా ప్రదానం చేస్తోంది. అమరావతిలో బాడ్మింటన్ అకాడమీకి 15 ఎకరాలు ఇస్తానని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
గోపిచంద్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఇచ్చింది.
సింధు పొందిన రివార్డులు....

- తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు
- ఢిల్లీ ప్రభుత్వం రూ. 2 కోట్లు
- బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్), క్రీడా మంత్రిత్వ శాఖ, హర్యానా, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు 50 లక్షల రూపాయల చొప్పున
- భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) రూ. 75 లక్షలు
- యుఎఇలో ఉంటున్న కేరళ వాణిజ్యవేత్త ముక్కట్టు సెబాస్టియన్ రూ. 50 లక్షలు
- భారత ఒలింపిక్స్ సంఘం (ఐఓఎ) రూ. 30 లక్షలు
- అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం (ఎఐఎఫ్ఎఫ్) రూ. 5 లక్షలు
- బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 1.01 లక్షలు
- ఎన్ఎసి జ్యువెల్లరీస్ నుంచి రూ.6 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్
- హైదరాబాద్ బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ అధ్యక్షుడు వి. చాముండేశ్వరినాథ్ ద్వారా బిఎండబ్ల్యు కారు
- హైదరాబాదులోని గచ్చిబౌలిలో తెలంగాణ ప్రభుత్వం వేయి గజాల ఇంటి స్థలం
- అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేయి గజాల ఇంటి స్థలం