For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాడు గోపీచంద్ కోపానికి సింధు కన్నీళ్లు: నేడు స్వర్ణం ముంగిట

హైదరాబాద్: ప్రపంచ మెగా ఈవెంట్‌లో ఫైనల్ వరకు చేరుకుని పతకం ఖరారు చేసుకున్న పీవీ సింధు విజయాల వెనక ఒక అదృశ్య శక్తి పని చేసింది. అదే ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్. 10ఏళ్ల నుంచి గోపీచంద్.. సింధుకు బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇస్తున్నారు. సింధు కఠోర పరిశ్రమతోపాటు గోపీచంద్ నిరంతర కృషి ఆమెను ఒలింపిక్స్ స్వర్ణ పతకం ముంగిట నిలిపిందని చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని సింధు, సింధు తల్లిదండ్రులు విజయలక్ష్మి, రమణ, ఆమె సోదరి దివ్య కూడా చెబుతున్నారు.

సింధు ఫిట్నెస్‌ సాధించడంలో గానీ, తన కన్నా ఉత్తమ ర్యాంకు కలిగిన హేమాహేమీలను కూడా లెక్క చేయకుండా వారిపై ఆధిపత్యాన్ని సాధించడంలో గానీ.. గోపీచంద్ పాత్ర అనిర్వచనీయం. సింధు విజయంలో గోపీచంద్ పాత్ర అంటే.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆయనే అన్నమాట.

సింధు శిక్షణకు సంబంధించిన విషయాల్లోకి వెళితే.. పది నెలల క్రితం ఒకరోజు అది గోపీచంద్‌ అకాడమీ అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ శిక్షణ పొందుతున్న సుమారు 50 మంది షట్లర్లందరూ టెన్షన్‌గా ఉన్నారు. వాతావరణం గంభీరంగా ఉంది. పీవీ సింధు ఒక్కతే కోర్టు మధ్యలో తలొంచుకుని నిలబడి ఉంది. కోచ్‌ గోపీచంద్‌ ఆమె ఆటతీరు పట్ల ఆగ్రహంగా ఉన్నాడు. ఇలా అయితే అసలు రాకెట్‌ ముట్టుకోవద్దని సీరియస్‌గా చెప్పాడు. ఆ మాటకు సింధు కంట నీళ్లు ఆగలేదు.

బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సింధు పట్ల కోచ్‌ అంత కఠువుగా మాట్లాడడం ఊహించని పరిణామమే! అప్పుడు సింధు తల్లిడండ్రులు కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే గోపీ.. ఆ రోజు ఆగ్రహంతో ఊగిపోవడానికి కారణం లేకపోలేదు. ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సింధు కోర్టులో మరీ ఎక్కువ రక్షణాత్మకంగా ఆడటం.. దానివల్లే ఓటమిపాలవడం గోపీ కోపానికి కారణం.

Pullela Gopichand: The power behind PV Sindhu, and Indian badminton

మనదేశంలో పిల్లలు ఎక్కువగా రక్షణాత్మక వాతావరణంలో పెరుగుతున్నారన్నది గోపీ అభిప్రాయం. ఆటల్లో అలాంటి తత్వం పనికిరాదు. ఒక్కసారి బరిలోకి దిగిన తర్వాత తెలివైన ఆటకు దూకుడు కూడా జోడించాలి. దూకుడుతోనే ప్రత్యర్థిని భయపెట్టాలనేది గోపీ నమ్మిన సిద్ధాంతం. సింధు ఆటలో ఆ దూకుడు లోపించడమే అతని అసహనానికి, కోపానికి కారణం. అందుకే ఎటాకింగ్‌ గేమ్‌పై దృష్టిపెట్టమని సింధుకు ఆదేశించాడు.

ఆటలో దూకుడుకుండే ప్రాధాన్యత ఏమిటో తెలుసు కాబట్టే దాన్నే సింధుకు నూరిపోశాడు. సింధు కూడా తన లోపాన్ని అర్థం చేసుకుంది. దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ రోజు గోపీ అలా చెప్పి ఉండకపోతే.. ఈ రోజు రియోలో సింధు ఫైనల్‌కు వచ్చి ఉండేదే కాదు! భారత్‌కు పతకం ఖాయం చేసి ఉండేదే కాదు! సెమీఫైనల్లో ఒకుహరాపై సింధు ఆడిన ఆట చూసిన వారంతా ఆమె ఆటకు ముగ్దులైపోయారు. ఇదంతా గోపీ శిక్షణే.

తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ నెట్‌పైకి దూకుతూ.. సింధు కొడుతున్న స్మాష్‌లకు ఒకుహరా వద్ద సమాధానమే లేకపోయింది. పది నెలల వ్యవధిలో సింధు ఆటతీరులో ఇంతటి తేడాకు కారణం గోపీచంద్‌ అనడంలో సందేహించాల్సిన పనిలేదు. సిడ్నీ వేదికగా జరిగిన 2000 ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగిన గోపీచంద్‌ ప్రీ క్వార్టర్స్‌లోనే ఓటమిపాలయ్యాడు.

పతకం రానందుకు ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ.. గోపీలో మాత్రం ఆనాడు కసి పెరిగింది. ఎలాగైనా సాధిస్తాననే ఆత్మవిశ్వాసం కనిపించింది. 'ఒలింపిక్‌ పతకం సాధించలేకపోయాను. వచ్చే ఒలింపిక్స్‌ (2004)లో పాల్గొంటానో లేదో చెప్పలేను. కానీ.. కోచ్‌గానైనా ఒలింపిక్‌ పతకం సాధిస్తాను' అని సహచర క్రీడాకారిణి అపర్ణ పొపట్‌తో అన్నాడు.

ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు

ఇప్పటిక గోపీ కల నిజమైంది. ఆటగాడిగా సాధించలేనిది ఒక కోచ్‌గా సాధించాడు. అది కూడా నాలుగేళ్ల క్రితమే. తన ప్రియ శిష్యురాలు సైనా నెహ్వాల్‌ 2012 లండన్‌లోనే కాంస్యం నెగ్గి గోపీ కల నెరవేర్చింది. ఇప్పుడు రియోలో మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు చేరడం ద్వారా సింధు.. తన గురువును మరో మెట్టుపైన నిలబెట్టింది.

ఈ ఘనత సింధు ఒక్కదానిదే అంటే గోపీ ప్రతిభను తక్కువ చేసినట్టే. సింధు ప్రతి అడుగులోనూ గోపీ శిక్షణ, కృషి, పక్కా ప్రణాళిక దాగున్నాయనడంలో అతిశయోక్తి లేదు. సింధును స్వర్ణం ముందు నిలబెట్టిన గోపీచంద్.. గురువుగా తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:22 [IST]
Other articles published on Nov 15, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+