
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో కోచ్‌లు, శిక్షణ సిబ్బంది ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నాడు. గత మూడు నెలలుగా వాళ్లకు సరిగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. క్రీడలకు కీలకమైన వేసవి మొత్తం ఎలాంటి ఈవెంట్లు జరగకపోవడంతో వారు ఆదాయాన్ని కోల్పోయారని అన్నాడు.
ఈ నేపథ్యంలో అకాడమీలు, క్రీడా సంస్థలకు నిధుల సేకరణ కోసం 'రన్ టు ది మూన్' అనే కార్యక్రమంలో అథ్లెట్లు అశ్విని నాచప్ప, మాలతి కృష్ణమూర్తిలతో కలిసి పుల్లెల గోపీచంద్ భాగస్వామి కానున్నాడు. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్‌ఈబీ స్పోర్ట్స్ కూడా చేతులు కలిపాయి. ఇందులో భాగంగా 3,84,400 కిలోమీటర్ల దూరాన్ని (భూమి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం) పూర్తి చేసే ఉద్దేశంతో ఈ నెల 20 నుంచి 30 రోజుల పాటు దేశవ్యాప్తంగా పరుగు నిర్వహించనున్నారు.
ఈ పరుగులో పాల్గొనాల్సిన వాళ్లు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల వ్యవధిలో ఒక్కొక్కరు కనీసం 65 కిలోమీటర్లు పరుగెత్తాలి. ఇలా వచ్చిన విరాళాన్ని వివిధ కోచింగ్ సంస్థలకు గోపీచంద్ బృందం అందించనుంది. లాక్‌డౌన్ కారణంగా జీతాల్లేని కోచ్‌లు, సహాయక సిబ్బందికి అండగా నిలవగలమనే నమ్మకం ఉందని గోపీచంద్ ధీమా వ్యక్తం చేసాడు.
గత నెలలో పుల్లెల గోపీచంద్‌కు వైద్య సిబ్బంది హోం క్వారంటైన్ స్టాంప్ వేసిన విషయం తెలిసిందే. 28 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని ఆయనకు సూచించారు. విజయవాడకు వెళ్లిన గోపీచంద్ అన్ని అనుమతులతో హైదరాబాద్‌కు బయలుదేరగా.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టు వద్ద అతని వాహనాన్ని ఆపిన వైద్య సిబ్బంది.. థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించి స్టాంప్ వేశారు.