
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన అథ్లెట్లతో పాటు ఆ మహా క్రీడలకు వెళ్లిన బృందంతో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన నివాసంలో భారత అథ్లెట్లకు ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమయంలో స్టార్ షట్లర్ పీవీ సింధుతో కలిసి ఆయన ఐస్‌క్రీమ్ తిన్నారు. టోక్యో గేమ్స్ వెళ్లే ముందు అథ్లెట్లతో ముచ్చటించిన సమయంలో.. పతకంతో తిరిగి వచ్చాక ఐస్‌క్రీమ్ తిందామని సింధుతో ప్రధాని చెప్పిన విషయం తెలిసిందే. దాని ప్రకారమే ఇవాళ మోదీ తన మాట నిలబెట్టుకున్నారు.
ఈరోజు జరిగిన సన్మాన కార్యక్రమంలో జావెలిన్ త్రో గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతోనూ ప్రధాని మోదీ ఫోటో దిగారు. వారిద్దరూ కాసేపు గడిపారు. తనకు చూర్మ వంటకం అంటే ఇష్టమని మెడల్ గెలిచిన అనంతరం నీరజ్ చెప్పారు. అందుకే చూర్మను నీరజ్ చోప్రా కోసం మోదీ చేయించారు. ఇక హైదరాబాదీ షట్లర్ పీవీ సింధుతోనూ మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు. టోక్యో బ్యాడ్మింటన్‌లో సింధు బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు సింధూ రియో పతకాన్ని కూడా తీసుకువచ్చింది. రెండు మెడల్స్ మెడలో వేసుకుని ప్రధానితో ఆమె ఫోటో దిగింది.
ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటకు కూడా అథ్లెట్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని తన ప్రసంగం వేళ అథ్లెట్లపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. తన నివాసానికి వచ్చిన అథ్లెట్లను మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ఒక్కో అథ్లెట్ వద్దకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడారు. వారు సాధించిన విజయాలను ప్రశంసించారు. మున్ముందు మరింత బాగా రాణించాలని సూచించారు. ఈ క్రమంలో పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీం తిన్నారు. నీరజ్ చోప్రాకు చుర్మా రుచి చూపించారు. క్రీడాకారులు అందరితో కలిసి ఫొటోలు దిగారు.
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్‌కు మొత్తం ఏడు మెడల్స్ వచ్చాయి. మెన్స్ హాకీ టీమ్‌తో పాటు నీరజ్ చోప్రా, పీవీ సింధు, రవికుమార్ దహియా, భజరంగ్ పూనియా, మీరాబాయి ఛాను, లవ్లీనా బోర్గోహైన్ పతకాలు గెలిచారు. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ఇంతకముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అయితే దీనిని పక్కకు తోస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరింత అద్బుతంగా ఆడింది.