
హైదరాబాద్: గువహటి వేదికగా శనివారం ప్రారంభమైన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్‌కు షాక్ తగిలింది. టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో అవధె వారియర్స్ 4-3 పాయింట్ల తేడాతో స్మాషర్స్‌పై విజయాన్ని నమోదు చేసింది.
అవధె వారియర్స్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకున్నా వారియర్స్ విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్... మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో టాంగ్ చున్ మన్-క్రిస్టినా పెడర్సన్‌ల జోడీ రాణించడంతో మూడో సీజన్‌లో అవధ్ వారియర్స్ శుభారంభం చేసింది.
తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో టాంగ్ చున్ మన్-క్రిస్టినా పెడర్సన్ (అవధ్) జంట 10-15, 15-5, 15-12తో క్రిస్ అడ్‌కాక్-గాబ్రియేలా అడ్‌కాక్ జోడీపై గెలిచి వారియర్స్‌కు శుభారంభాన్నిచ్చింది. ఆ తర్వాతి మ్యాచ్‌ను వారియర్స్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకోగా.. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ (అవధ్) 15-12, 15-8తో డానియల్ ఫరీద్‌ను ఓడించాడు.
ట్రంప్ మ్యాచ్‌లో విజయ సాధిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. దీంతో రెండు పాయింట్లు సాధించిన వారియర్స్ 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (అవధ్) 15-12, 15-13తో లెవెర్‌డెజ్‌పై నెగ్గడంతో వారియర్స్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 4-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది.
అయితే చివరి రెండు మ్యాచ్‌లు (పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్) నెగ్గడం ద్వారా వారియర్స్ ఆధిక్యాన్ని చెన్నై 4-3కు తగ్గించింది. పురుషుల డబుల్స్‌లో క్రిస్ అడ్‌కాక్-యోంగ్ లీ జోడీ 15-11, 10-15, 15-11తో హెండ్రా సెతియవన్-చిన్ చుంగ్ (అవధె) జోడీపై విజయం సాధించింది.
ఆ తర్వాత చెన్నై స్టార్ ప్లేయర్ పీవీ సింధుతో మహిళల సింగిల్స్‌లో అవధె వారియర్స్ తరఫున తలపడాల్సిన సైనా నెహ్వాల్ గాయంతో వైదొలిగింది. సైనా స్థానంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు బరిలోకి దిగింది. సింధు 15-10, 15-9తో ఉత్తేజితపై గెలిచింది. సైనా-సింధుల మ్యాచ్ ట్రంప్ మ్యాచ్ కావడంతో చెన్నైకు రెండు పాయింట్లు లభించాయి.
దాంతో మొత్తంగా అవధె వారియర్స్ 4-3తో చెన్నై స్మాషర్స్‌ను ఓడించింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.