
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)-3వ సీజన్‌లో ఢిల్లీ డాషర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ చివరి లీగ్ పోరులో ఢిల్లీ 4-1 తేడాతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌ను ఓడించింది. దీంతో ఢిల్లీ మొత్తం 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
తాజా మ్యాచ్ ఫలితంతో స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, శ్రీకాంత్, కశ్యప్‌లతో కూడిన అవధె వారియర్స్ జట్టు లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇప్పటికే హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, అహ్మదాబాద్ రాకెట్స్ సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో ఎవరితో ఎవరు తలపడతారనేది గురువారం హైదరాబాద్, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో తేలనుంది.
కాగా, బుధవారం తొలుత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ జోడీ మిషెల్ లీ-షిన్ బాక్ చెల్ 15-13, 15-11తో అశ్విని పొన్నప్ప-వ్లదీమర్ ఇవనోవ్ (ఢిల్లీ)పై విజయం సాధించింది. దీంతో ఢిల్లీ 0-1తో వెనుకబడింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు విన్సెంట్ 15-13, 10-15, 15-12తో అజయ్ జయరాంపై విజయం సాధించాడు.
దాంతో స్కోరు 1-1తో సమంగా నిలిచింది. రెండో పురుషుల సింగిల్స్‌ను నార్త్ ఈస్టర్న్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు టివాన్ హవాయ్ 15-10, 8-15, 15-11తో వాంగ్‌జూపై విజయం సాధించాడు. దీంతో డిల్లీ 2-0తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్ మ్యాచ్‌ను ఢిల్లీ ట్రంప్‌గా ఎంచుకుంది.
ఇందులో సత్తా చాటిన సుంగ్ జీ హున్ 13-15, 15-11, 15-13తో మిచెల్లి లీని ఓడించడంతో 4-0 ఆధిక్యంతో ఢిల్లీ విజయం ఖరారు చేసుకుంది. చివరిదైన పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో ఇవనోవ్- ఇవాన్ జోడీ 15-9, 10-15, 9-15తో చియోల్-జంగ్ (నార్త్ ఈస్టర్న్) చేతిలో ఓటమి పాలైంది.
దీంతో అవధె వారియర్స్ 12 పాయింట్లతో ఆరో స్థానంతో లీగ్‌ను ముగించడంతో సెమీస్ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే గురువారం హైదరాబాద్ హంటర్స్ జట్టు బెంగాల్ బ్లాస్టర్స్‌తో తలపడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.