
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ (పీబీఎల్)లో లీగ్ భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో హైదరాబాద్ హంటర్స్ సెమీ్‌సలోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా హైదరాబాద్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. సొంతగడ్డపై శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో హంటర్స్ 3-0తో ఢిల్లీ డాషర్స్‌ను చిత్తు చేసింది.
ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ అద్భుత ప్రతిభతో కీలక మ్యాచ్‌లో గెలుపొంది హంటర్స్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసింది. హైదరాబాద్ ట్రంప్‌గా ఎంచుకున్న మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ఓ గేమ్ కోల్పోయిన మారిన్ ఆపై అద్భుతంగా పుంజుకొని 12-15, 15-10, 15-9తో సంగ్ జీ హ్యున్‌పై నెగ్గింది.
అయితే సెమీస్ పోరును హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో హైదరాబాద్ జోడీ బెర్నాడెత్ - సాత్విక్ సాయిరాజ్ 15-13, 10-15, 10-15తో అశ్విని పొన్నప్ప- ఇవనోవ్ జంట చేతిలో ఓడింది. అయితే, ఢిల్లీ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్న పురుషుల తొలి సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 15-9, 15-8తో తిన్ హోవీపై నెగ్గాడు.
దీంతో ఢిల్లీ ఓ పాయింట్ కోల్పోవడంతో హైదరాబాద్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత తమ ట్రంప్ మ్యాచ్‌లో మారిన్ నెగ్గడంతో హైదరాబాద్ 3-0తో అప్పటికే విజయాన్ని ఖరారు చేసుకుంది. దీంతో ఆ తర్వాత జరగాల్సిన పురుషుల రెండో సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌లు నామమాత్రమే కావడంతో వీటిని నిర్వహించలేదు. శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో బెంగళూరు బ్లాస్టర్స్ - అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ జట్లు తలపడతాయి. ఆదివారం ఫైనల్ జరగనుంది.