హైదరాబాద్: దయచేసి పాస్ పోర్టు ఇప్పించడంలో సహాయపడాలని భారత ఏస్ షట్లర్ పారుపల్లి కశ్యప్ ట్విటర్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విజ్ఞప్తి చేశాడు. వివరాల్లోకి వెళితే న్యూజిలాండ్ వీసా కోసం వారం కిందట దరఖాస్తు చేసుకున్న పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్ ప్రణయ్, సిక్కిరెడ్డిలకు ఇంకా పాస్‌పోర్టు అందలేదు.
ఈ ముగ్గురూ కెనడా, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో పాల్గొనేందుకు గురువారం కెనడాకు బయల్దేరాల్సి ఉంది. అయితే పాస్ పోర్టు ఇంకా అందని నేపథ్యంలో తమకు సహాయపడాలని ట్విట్టర్‌లో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వివరాలతో ట్వీట్ చేశాడు.

తన ట్వీట్‌లో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్‌ను కూడా టాగ్ చేశాడు. అయితే పారుపల్లి కశ్యప్ ట్వీట్‌కు సుష్మా ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే కెనడా ఓపెన్ జులై 11 నుంచి ప్రారంభం అవుతుండగా, యుఎస్ ఓపెన్ జులై 19 నుంచి ప్రారంభం కానుంది.
అయితే వీసా సమస్యను ఎదుర్కొనడం భారత షట్లర్లకు ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలా జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు కెనడా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వీరికి పాస్‌పోర్టు లభించడం ఆలస్యమైంది. దీంతో భారత బ్యాడ్మింటన్ సంఘం జోక్యం చేసుకోవడంతో అప్పుడు వారికి వెంటనే పాస్‌పోర్టులు లభించాయి.