న్యూఢిల్లీ: గాయాలతో బాధపడుతూ దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో ఆడాలా? అంటూ భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారులపై స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. (సౌత్ ఏసియన్ గేమ్స్)సాగ్ నుంచి తనను మినహాయించాలని కోరుతూ బాయ్‌తోపాటు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు కూడా తాను లేఖలు రాశానని మంగళవారం పిటిఐతో మాట్లాడుతూ కశ్యప్ చెప్పాడు.
కానీ, ఎవరూ సానుకూలంగా స్పందించలేదని వాపోయాడు. అంతేగాక, సాగ్‌లో పాల్గొనాలని కోరుతూ గౌహతికి విమానం టికెట్లు పంపారని చెప్పాడు. పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నందువల్లే తాను ఈ సీజన్‌లో 7టోర్నీలకు దూరమయ్యానని అన్నాడు.
రియో డిజెనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించేందుకు తనకు 12 వారాల సమయం మాత్రమే ఉందని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఒకప్పుడు 8వ స్థానంలో ఉన్నప్పటికీ, తాజాగా 12వ స్థానానికి పడిపోయిన కశ్యప్ అన్నాడు.

ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)తోపాటు లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీలో తాను ఆడానని తెలిపాడు. లక్నో టోర్నీలో ఆడుతున్న సమయంలోనే పొత్తికడుపు కండరాల సమస్య తిరగబెట్టిందని చెప్పాడు. తన సమస్యను వివరిస్తూ బాయ్, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయడమేగాక, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్‌ను స్వయంగా కలిసి వివరించానని తెలిపాడు. కానీ, ఫలితం దక్కలేదని 29 ఏళ్ల కశ్యప్ చెప్పాడు.
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని కశ్యప్ వాపోయాడు. 'స్వదేశంలో జరుగుతున్న సాగ్‌లో అత్యుత్తమ జట్లు ఆడాలన్నది ప్రభుత్వ ఆలోచన. నిజమే. కానీ, నాది ప్రత్యేక కేసు. ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు నాకు 12 వారాల సమయం మాత్రమే ఉంది. వీటిలో ఏడు వారాలు ఆటకు, ఐదు వారాలు శిక్షణకు ఉపయోగించుకోవాలి' అని తెలిపాడు.
'ఇంత తక్కువ సమయంలో ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడం చాలా కష్టమైన విషయం. దీనికి తోడు సాగ్‌లో పాల్గొనడం దాదాపు అసాధ్యం. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సాగ్‌లో పాల్గొన్నప్పుడు ఒకవేళ నా గాయం మళ్లీ మొదటికొస్తే, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాలన్న నా ప్రయత్నం వృథా అవుతుంది' అని వాపోయాడు.
'అధికారులేమో నాకు టికెట్లు కూడా పంపి, తప్పనిసరిగా పాల్గొనాలంటూ పరోక్షంగా సంకేతాలు అందించారు. ఎటూ తేల్చుకోలేని సంకట స్థితిని ఎదుర్కొంటున్నాను' అని కశ్యప్ అన్నాడు. గత అక్టోబర్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ ఆడుతున్నప్పుడు కాలి పిక్క కండరాలు చిట్లడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నానని కశ్యప్ తెలిపాడు.