హైదరాబాద్: దేశం గర్వించదగ్గ కోచ్ అంటూ నలుమూలల నుంచి ప్రశంసలందుకున్న పుల్లెల గోపీచంద్.. ఒలింపిక్స్‌లో తన శిష్యులు సైనా నెహ్వాల్, పీవీ సింధుల ద్వారా దేశానికి రెండు పతకాలు కూడా సాధించిపెట్టాడు. అంతా బాగానే ఉన్నా.. ఆయన నేతృత్వంలోని గోపీచంద్ అకాడమీని వీడుతున్న క్రీడాకారుల సంఖ్య పెరిగిపోతుండటం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
2012 ఒలింపిక్స్ దాకా గోపీచంద్ అకాడెమీలో ఉన్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆ ఏడాది ఒలింపిక్స్‌లో పతకం కూడా సాధించింది. అయితే, ఆ తర్వాత గోపీచంద్ అకాడమీని వీడింది. బెంగళూరులో మరో కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఆయన నేతృత్వంలో పలు విజయాలు సాధించినప్పటికీ.. ఆమె మొన్నటి రియో ఒలింపిక్స్‌లో అంతగా రాణించలేకపోయింది.

ఇది ఇలా ఉండగా, తాజాగా బ్యాడ్మింటన్‌లో ప్రముఖ క్రీడాకారుడిగా కొనసాగుతున్న పారుపల్లి కశ్యప్ కూడా గోపీచంద్ అకాడమీని వీడటం గమనార్హం. మోకాలికి అయిన గాయం కారణంగా కశ్యప్ రియో ఒలింపిక్స్ లో పాల్గొనలేకపోయాడు.
గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న అతడు ఇకపై బెంగళూరును కేంద్రంగా చేసుకుని కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దీంతోనే గోపీచంద్ అకాడమీకి గుడ్ చెప్పిన కశ్యప్... బెంగళూరులోని టామ్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.