హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్ పీవీ సింధు ఓటమి చవి చూసింది. ఆదివారం నాడు జరిగిన ఫైనల్లో తైపీ షట్లర్ తై జు యింగ్ చేతిలో 15 - 21, 17 - 21 తేడాతో పరాజయం పాలయింది. గత ఆదివారం చైనా సూపర్ సిరీస్‌ను గెలుపొంది జోరుమీదున్న సింధు హాంకాంగ్ ఓపెన్‌లో ప్రత్యర్థులను మట్టి కరిపించి ఫైనల్ చేరుకుంది.

కానీ ఫైనల్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చేతిలో వరుస రౌండ్లలో ఓడిపోయింది. తొలి రౌండ్‌లో ఒక దశలో 6-6తో ఇద్దరూ సమాన పాయింట్లు సాధించారు. ఆ తర్వాత చెలరేగిన తై జు యింగ్ వరుస పాయింట్లు సాధించి 11-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆ తర్వాత ఎక్కడా తడబడకుండా 21-15తో తొలిసెట్‌ను తయ్‌జు కైవసం చేసుకుంది. కీలకమైన రెండో రౌండ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా 7-7, 10-10తో సమానంగా ఆడారు. ఒక దశలో తై జు 15-13తో దూసుకెళ్లింది. అనంతరం పుంజుకున్న సింధు 16-18తో గట్టి పోటీనిచ్చింది. ఆ తర్వాత ప్రత్యర్థి మెరుగ్గా ఆడటంతో ఓటమి తప్పలేదు.