హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిర్మాతగా మారింది. టీచర్స్ డే సందర్భంగా పీవీ సింధు తన కోచ్ గోపీచంద్‌కు గురుదక్షిణగా ఓ డిజిటల్ ఫిల్మ్‌ను నిర్మించింది. ఈ డిజిటల్ ఫిల్మ్‌లో సింధునే స్వయంగా నటించింది. గోపీ శిక్షణలో తానెలా రాటుదేలిందన్న అంశాన్ని ఇతి వృత్తంగా తీసుకొని ఈ డిజిటల్ ఫిల్మ్‌ను రూపొందించింది.
'#IHATEMYTEACHER' పేరుతో ఉన్న ఈ డిజిటల్ ఫిల్మ్‌లో గోపీచంద్‌తో తన ప్రయాణం ఎలా సాగిందో క్లుప్తంగా వివరించింది. 'కోచ్ నిర్విరామంగా కష్టపడుతుంటారు. నా కోసం కలలు కంటారు. నాలో ఆత్మవిశ్వాసం నింపుతారు. నన్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఆయనకు నేనిస్తున్న చిన్న కానుకే ఇది. ఈ గురుపూజోత్సవం నాడు నా విజయాన్నంతా ఆయనకు అంకితమిస్తున్నా' అని సింధు తెలిపింది.
'మీ జీవితాల్లో మార్పు తెచ్చి విజయాల బాట పట్టించిన ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిందిగా కోరుతున్నా. మనపై మనం ఉంచే విశ్వాసం కన్నా వారు మనపై ఉంచే నమ్మకమే ఎక్కువ' అని సింధు ఈ సందర్భంగా తెలిపింది. గోపీచంద్ శిక్షణలో సింధు రియో ఒలింపిక్స్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే.