
హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో సంచలనం నమోదైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ కెంటో మోమోటా 21-17, 21-13తో రియో ఒలింపిక్స్ పతక స్వర్ణ విజేత చెన్ లాంగ్ (చైనా)ను ఓడించాడు.
తద్వారా ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా కెంటా మోమోటా అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో చెన్ లాంగ్ మూడో స్థానంలో ఉండగా, మొమోటో 17వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
జపాన్‌లో జూదం ఆడటం నిషేధం. అయితే, 2016లో మోమోటా జూదం ఆడుతూ అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. దీంతో అతడిని జపాన్ బ్యాడ్మింటన్ సంఘం ఏడాదిపాటు సస్పెండ్ చేయడంతోపాటు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టు నుంచి కూడా తొలగించింది.
అతడిపై గతేడాది మేలో నిషేధం పూర్తయ్యాక పునరాగమనం చేసిన అనంతరం చిన్న చిన్న టోర్నీలో ఆడుతూ నెమ్మదిగా తన ర్యాంకుని మెరుగుపరచుకున్నాడు. తాజాగా ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని పూర్వ వైభవాన్ని సాధించాడు.
మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) గెలిచింది. ఫైనల్లో తైజు 21-19, 22-20తో ఐదో సీడ్ చెన్ యుఫై (చైనా)పై విజయం సాధించింది.