మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ ముందంజ వేశాడు.
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి మరోసారి మంచి ప్రదర్శన చేసింది. మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-1000 టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది. తాజాగా జరిగిన ఈ టోర్నీలోని పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి మూడు గేమ్‌ల పాటు పోరాడాల్సి వచ్చింది. 21-10, 16-21, 21-5 తేడాతో మింగ్ చి లు, కై వి టాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించారు.

సింగిల్స్ విభాగంలో మిశ్రమ స్పందనలు
మరోవైపు సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ ముందంజ వేశాడు. మొదటి రౌండ్లో ప్రణయ్ 21-12, 17-21, 21-15తో బ్రయాన్ యాంగ్ (కెనడా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించాడు. వాస్తవానికి మంగళవారమే ఈ మ్యాచ్ పూర్తి కావాల్సింది. కానీ పైకప్పు లీకేజీ కారణంగా బుధవారం జరిగింది.
ప్రియాన్షు రజావత్ 11-21, 16-21తో షై ఫెంగ్ (చైనా)పై ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బాన్సోద్ 21-15, 21-16తో జిన్ వీ (మలేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఆకర్షి 14-21, 12-21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో, అనుపమ 17-21, 21-18, 8-21తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పొందారు.