
హైదరాబాద్: బ్యాడ్మింటన్ దిగ్గజం, మలేసియా స్టార్ ప్లేయర్ లీ చోంగ్ వీ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో రజత పతకాలతో సత్తా చాటిన ఈ 35 ఏళ్ల స్టార్ ప్లేయర్ ఆరోగ్యంపై వదంతులు ప్రచారంలో ఉన్నాయి. వీటికి చెక్ పెట్టాలని భావించిన బీఏఎం లీ చోంగ్ వీ ఆరోగ్యం వివరాలు వెల్లడించింది.
ముక్కుకు సంబంధించిన క్యాన్సర్‌తో లీ చోంగ్ పోరాడుతున్నాడని, తైవాన్‌లో చికిత్స పొందుతున్నాడని మలేసియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బీఏఎం) శనివారం ప్రకటించింది. 'లీ చాంగ్ వీ ఎర్లీ స్టేజ్ ముక్కు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తైవాన్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. చికిత్సతో అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుని తిరిగొస్తాడు' అని బీఏఎం అధ్యక్షుడు దతుక్ సెరీ నోర్జా జకారియా ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది జులైలో లీ చాంగ్‌కు శ్వాస సంబంధమైన సమస్య ఏర్పడింది. దీంతో ఆసుపత్రిలో సంప్రదించగా.. ముక్కు క్యాన్సర్ అని తేలింది. కాగా.. లీ చాంగ్ మూడో దశ ముక్కు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై బీఏఎం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రపంచ మాజీ నంబర్ 1 బ్యాడ్మింటన్ ఆటగాడైన లీ చాంగ్.. ఒలింపిక్స్‌లో మూడు సార్లు రజత పతకం సాధించాడు. అయితే అనారోగ్యం కారణంగా ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియాన్ గేమ్స్‌కు లీ దూరమయ్యాడు. దీనిపై స్పందించిన లీ ఛాంగ్ వీ ' నా ఆరోగ్యం పట్ల మీరు చూపిస్తున్న ఉదారతకు సంతోషిస్తున్నాను. త్వరలోనే కోలుకుని మళ్లీ కోర్టులో తప్పుకుండా అడుగుపెడతాను. నన్ను మర్చిపోకండి' అని వివరించాడు.