ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత యువ సంచలనం లక్ష్యసేన్ సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌లో కెనడాకు చెందిన విక్టర్ లాయ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అయితే ఈ విజయం వెనుక లక్ష్య సేన్ చూపిన పట్టుదల, శారీరక శ్రమ వర్ణనాతీతం. సుమారు 1 గంట 37 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో లక్ష్య సేన్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆడారా అన్నట్లుగా సాగింది. మ్యాచ్ మధ్యలో ఆయన కాళ్లకు తీవ్రమైన బొబ్బలు వచ్చి, కోర్టుపై రక్తం చుక్కలు కనిపిస్తున్నా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోరాడి 21-16, 18-21, 21-15 తేడాతో విజయాన్ని అందుకున్నాడు.
అసాధ్యమైన ప్రయాణం.. అద్భుత విజయాలు
ఈ టోర్నీలో లక్ష్య సేన్ ప్రయాణం ఓ సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తోంది. టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన హేమాహేమీలను లక్ష్యసేన్ మట్టికరిపించాడు. మొదటి రౌండ్‌లోనే ప్రపంచ నంబర్-1 ఆటగాడు, చైనాకు చెందిన షి యుకికి షాక్ ఇచ్చి తన ఉద్దేశ్యాన్ని చాటాడు. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్‌లో 6వ సీడ్ ప్లేయర్ లీ షిఫెంగ్‌ను ఓడించి సెమీస్‌కు చేరారు. సెమీఫైనల్‌లో గాయం బాధిస్తున్నా, నడకలో తడబాటు ఉన్నా.. తన అద్భుతమైన స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. ఈ విజయంతో లక్ష్య సేన్ 2022 తర్వాత రెండోసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నట్లయింది.

దిగ్గజాల సరసన చేరే సువర్ణావకాశం
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో 'ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్' టైటిల్ నెగ్గడం అనేది ఓ గొప్ప మైలురాయి. ఇప్పటివరకు భారత తరపున దిగ్గజ క్రీడాకారులు ప్రకాష్ పదుకొనే (1980), పుల్లెల గోపిచంద్ (2001) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఒకవేళ ఆదివారం జరగబోయే ఫైనల్‌లో లక్ష్య సేన్ విజయం సాధిస్తే, సుమారు 25 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ నెగ్గిన మూడో భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టిస్తాడు. 2022లో ఫైనల్ వరకు వచ్చి తృటిలో చేజార్చుకున్న టైటిల్‌ను ఈసారి ఎలాగైనా ముద్దాడాలని లక్ష్య కృతనిశ్చయంతో ఉన్నాడు.
ఫైనల్ ఫైట్: చైనీస్ తైపీ సవాల్
ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫైనల్‌లో లక్ష్య సేన్, చైనీస్ తైపీకి చెందిన లిన్ చున్-యీతో తలపడనున్నారు. లిన్ చున్-యీ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సెమీఫైనల్‌లో ప్రపంచ రెండో నంబర్ ప్లేయర్ కున్లావుత్ వితిదసర్ణ్‌ను ఓడించి ఫైనల్‌కు వచ్చాడు. ఇద్దరు యువ ఆటగాళ్ల మధ్య జరగనున్న ఈ పోరులో లక్ష్య సేన్ తన అనుభవాన్ని, పట్టుదలను ఎలా ఉపయోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాళ్ల గాయం ఫైనల్ మ్యాచ్‌పై ప్రభావం చూపకుండా ఉండేందుకు వైద్య బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. కోట్లాది మంది భారతీయులు లక్ష్య సేన్ చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నారు.