
హైదరాబాద్: సియోల్ వేదికగా జరుగుతున్న కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా నెహ్వాల్ 21-12, 21-11తో కిమ్ హయో మిన్ (దక్షిణ కొరియా)పై అలవోకగా విజయం సాధించింది.
సైనా ఈ మ్యాచ్‌ను 40 నిమిషాల్లోనే ముగించింది. ప్రత్యర్థి ఏ దశలోనూ సైనాకు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. తొలి గేమ్ ఆరంభంలో 6-2తో ఆధిక్యంలో నిలిచిన సైనా.. తర్వాత 12-3తో దూకుడు కనబర్చింది. విరామం తర్వాత మరింత చెలరేగిన సైనా 21-12తో గేమ్ దక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లో కూడా సైనాకు ఎదురులేకుండా పోయింది.
టోర్నీలో భాగంగా గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో కొరియాకే చెందిన కిమ్ గా యున్‌తో సైనా తలపడనుంది. సైనా క్వార్టర్స్‌కు చేరితే మూడోసీడ్ నజోమి ఒకుహర (జపాన్) ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారత్‌కే చెందిన జక్కా వైష్ణవి రెడ్డి, సమీర్ వర్మ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.
అన్‌సీడెడ్ వైష్ణవి 10-21, 9-21తో ఆరోసీడ్ బెవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓటమి పాలైంది. ఇక, పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో సమీర్‌వర్మ 21-15, 16-21, 7-21 ఆండర్స్ ఆంటోన్‌సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడాడు.