
హైదరాబాద్: రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ పేరిట మొక్కలు నాటుతూ మిగతా సెలబ్రిటీలకి ఛాలెంజ్ విసురుతున్నారు .
తాజాగా భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్.... అర్జున్ రెడ్డి సినిమా హీరో విజయ్ దేవరకొండకు గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు. తాజాగా గ్రీన్ ఛాలెంజ్‌ను కిదాంబి శ్రీకాంత్ స్వీకరించి. ఇందులో భాగంగా తాను మొక్క నాటుతున్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి "ఛాలెంజ్‌ను స్వీకరించాను. పూర్తి చేశాను. ఇప్పుడు ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో విజయ్ దేవరకొండ, జ్యోత్స్న చిన్నప్ప, తుహిన్ మిశ్రాలు భాగస్వామ్యం కావాలని సవాలు విసురుతున్నా" అని ట్వీట్ చేశాడు.
ఆగస్టు 18 నుంచి ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా ఆరంభం కానున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు కిదాంబి శ్రీకాంత్ ఇండోనేషియాకు వెళ్లాడు. ఇండోనేషియాకు బయల్దేరడానికి ముందు శ్రీకాంత్ ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. ఆసియా గేమ్స్ ఆగస్టు 18న ప్రారంభమై సెప్టెంబరు 2తో ముగియనున్నాయి.
సమంతకి ఛాలెంజ్ విసిరిన సింధు
రియో ఒలింపిక్ విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సైతం ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ నుంచి గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన పీవీ సింధు.. మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత హీరోయిన్ సమంత, హీరో సూర్య, బాక్సింగ్ స్టార్ మేరీకోమ్‌లకు ఈ ఛాలెంజ్‌ను విసిరారు. ఈ సందర్భంగా తనని గ్రీన్ ఛాలెంజ్‌కి నామినేట్ చేసినందుకు లక్ష్మణ్‌కి ధన్యవాదాలు తెలిపింది.
భూమిని పచ్చగా ఉంచేందుకు అందరు హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నానంటూ పీవీ సింధు మొక్కలు నాటుతోన్న సమయంలో దిగిన ఫోటోలను అబిమానులతో ట్విట్టర్‌లో పంచుకుంది. ఇటీవల చైనాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో పీవీ సింధు రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ సవాలును స్వీకరించి మొక్కలు నాటారు. ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేసి ఇతరులను నామినేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో పాలు పంచుకుంటున్నారు. వీవీఎస్ లక్ష్మణ్, సైనా నెహ్వాల్, సచిన్, పీవీ సింధుతోపాటు పలువురు క్రీడాకారులు ఇప్పటికే ఈ సవాలును స్వీకరించారు.