హైదరాబాద్: సంక్షోభ సమయంలో తనకు మద్దతు నిలిచినవారందరికీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఉత్సాహంగా కనిపించారు. తాను ఎవరినీ చంపలేదని, తాను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని, ఎందుకు తనపై జీవిత కాలం నిషేధం విధించారని ఆమె అన్నారు.
తన పక్షాన హైకోర్టు ఆదేశాలు వెలువడడం ఎంతో సంతోషంగా ఉందని, తనను ఆడడానికి అనుమతించినందుకు ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. బ్యాడ్మింటన్ ఆడడం తప్ప తాను వేరేది ఏదీ చేయలేదని ఆమె అన్నారు. తాను బ్యాడ్మింటన్ ఆడుతానని, దేశానికి గౌరవాన్ని తెస్తానని, ప్రతి ఒక్కరినీ గర్వించేలా చేస్తానని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తన డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్పకు, తన కోచ్‌లకు జ్వాలా ధన్యవాదాలు తెలిపారు. తాను క్లీన్ స్పోర్ట్స్ ఇండియాకు, అశ్వినీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె అన్నారు. తనను మాత్రమే కాకుండా అశ్వినిని కూడా డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంట్‌కు అనుమతించలేదని, తన వల్ల అశ్విని తీవ్రమైన ఒత్తిడికి గురైందని జ్వాలా అన్నారు.
తనను అర్థం చేసుకుని అశ్విని తన పక్కన నిలిచిందని చెప్పారు. అది తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని అన్నారు. విమల్ కుమార్ సారుకు, ఆరిఫ్ సారుకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేనని ఆమె అన్నారు. తన మిత్రులకు, తనకు మద్దతిచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఆన్‌లైన్ సందేశాలు కూడా తనకు పోరాటం చేయడానికి శక్తిని ఇచ్చాయని అన్నారు.