న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) పై బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కోర్టుకు ఎక్కారు. ఇండియన్ బాడ్మింటన్ లీగ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందనే ఆరోపణపై తనపై బాయ్ జీవితం కాలం నిషేధం విధించాలనే బాయ్ క్రమశిక్షణా సంఘం సిఫార్సును ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ విషయంలో తాము న్యాయపరమైన చర్యలకు దిగాలని అనుకున్నామని, ఆ మేరకు ఢిల్లీ హైకోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేశామని జ్వాలా తండ్రి క్రాంతి గుత్తా చెప్పారు. బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నిర్ణయం అమలును పెండింగులో ఉంచింది. దీంతో జ్వాలా గుత్తాను వచ్చే నెల రోజుల పాటు ఏ అంతర్జాతీయ ఈవెంట్‌కు ఎంపిక అయ్యేలా చూడాలని చేసిన విజ్ఞప్తిని కూడా బాయ్ తోసిపుచ్చింది.

దాంతో జ్వాలా గుత్తా డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంటుల్లో ఆడే అవకాశం లేకుండా పోయింది. నోటీసు ఇవ్వకుండా బాయ్ మందుకు పోవడంపై పరువు నష్టం దావా వేయాలని జ్వాలా గుత్తా కోచ్ సయ్యద్ మొహమ్మద్ అరీఫ్ సలహా ఇచ్చారు.
తనను జ్వాలా కలిస్తే విషయంపై బాయ్‌తో మాట్లాడుతానని క్రీడా మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం చెప్పారు.