హైదరాబాద్: హైదరాబాదీ షట్లర్ జ్వాలా గుత్తా త్వరలో అకాడమీ ప్రారంభించనున్నారట. త్వరలో తాను బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభిస్తానని గతంలో గుత్తా జ్వాలా చెప్పారు. ఈ దిశలో ఆమె ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. జ్వాలా గుత్తా హైదరాబాదు యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో అకాడమీ ప్రారంభించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఆమె ఇందుకు దరఖాస్తు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను అకాడమీని ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని తెలుస్తోంది.

మూడు రోజుల క్రితం ఆమె దరఖాస్తు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె దరఖాస్తు పైన దాదాపు అందరి ఆమోద ముద్ర పడిందని వినికిడి. కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంతకం మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఇది పదిపదిహేను రోజుల్లో పూర్తి కావొచ్చని అంటున్నారు.
కాగా, అకాడమీ దరఖాస్తు పైన తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందిస్తుండటంతో జ్వాలా గుత్తా సంతోషం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇచ్చిన మాట ప్రకారం క్రీడల పట్ల ఈ ప్రభుత్వం శ్రద్ధ కనబరుస్తోందని అర్థమవుతోందని జ్వాలా భావిస్తున్నారట.