హైదరాబాద్: జ్వాలా గుత్తా. ఈ పేరు తెలుగు ప్రజలతో పాటు బ్యాడ్మింటన్ క్రీడను వీక్షించే ప్రతి అభిమానికి బాగా పరిచయం ఉన్న పేరు. ఆటతో పాటు అందం ఆమె సొంతం. అంతేకాదు ఆమె ఏమి మాట్లాడినా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. తాజాగా రియో పతక విజేత సింధు గురించి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గురించి జ్వాల మాట్లాడింది.
రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధుకు, సానియా మిర్జాకు దొరికిన సపోర్ట్ తనకు దక్కలేదని జ్వాల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 'ఇప్పటి వరకు నేను ప్రభుత్వాన్ని డబ్బులు అడగలేదు. ఎలాంటి అవార్డులనూ ఆశించలేదు. మొన్న సింధు ఒలింపిక్ పతకం గెలిచాక 'వాళ్ల కుటుంబం అంత కష్టపడింది. వాళ్ల నాన్నగారు ఎన్నో త్యాగాలు చేశారు' అంటున్నారు.

సింధు వాళ్ల కుటుంబం కష్టపడింది. అందులో డౌట్ లేదు. అయితే ఓ క్రీడాకారుడి కుటుంబ సభ్యులు ఎవరైనా అంతే కష్టపడతారు. కానీ సింధుకి దొరికిన సపోర్ట్ నాకెక్కడిది. సానియాకు కూడా సపోర్ట్ దొరికింది. తెలంగాణ గవర్నమెంటూ సపోర్ట్ చేసింది. దీని గురించి నేను నిజాలు మాట్లాడితే ఇష్టపడరు. కాంట్రవర్సీ చేస్తారు. ఇలాంటివి మాట్లాడకూడదు. నేను ఫేమస్ అయ్యానంటే అది కేవలం నా ఆటతోనే. నాకెవరూ సపోర్ట్ చేయలేదు' అని చెప్పింది.
అయితే తన తల్లితండ్రులతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేసిందని తెలిపింది. 'మా తల్లితండ్రులు నా ఆట కోసం డబ్బు ఖర్చుపెట్టారు. నేను కృతజ్ఞురాలినంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మా ట్రిప్స్‌కి ఫండింగ్ చేసింది. ఇంకెవరూ ఏమీ చేయలేదు' అని చెప్పుకొచ్చింది.
అలాగే బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ డబుల్స్‌ను సపోర్ట్ చేయరని చెప్పింది. 'నాకూ తెలియదు. సింగిల్స్‌కి సపోర్ట్ చేసినట్టు డబుల్స్‌కి ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఇప్పటికీ చేయట్లేదు. దీనికి కారణం ఏంటని అడుగుతున్నా? ఇది మాట్లాడ్డానికి చాలామంది ప్లేయర్స్ భయపడ్తారు.అంతే తప్ప అతనితో తనకెలాంటి ఇబ్బందులూ లేవు' అని పేర్కొంది.