హైదరాబాద్: జపాన్ ఓపెన్ సూపర్ సిరిస్‌లో భారత మహిళల సింగిల్స్ పోరు ముగిసింది. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. దీంతో పీవీ సింధుతో పాటు సైనా నెహ్వాల్ కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టోర్నీలో భాగంగా గురువారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన నోజిమి ఒకుహరతో తలపడిన సింధు 18-21, 21-8తో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులందరూ సైనా నెహ్వాల్ ఆటపైనే దృష్టిసారించారు. టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన కరోలినా మారిన్‌తో తలపడిన సైనా 16-21, 13-21 తేడాతో ఓటమి పాలైంది.

43నిమిషాల పాటు హోరా హోరీగా జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను సైనా 16-21తో కోల్పోయింది. రెండో గేమ్‌ను దూకుడుగా ప్రారంభించిన సైనా, ఆ తర్వాత ప్రత్యర్థి మారన్‌కు ధీటుగా బదులిచ్చినా 13-21తో రెండో గేమ్‌ను చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది.

దీంతో ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో భారత పోరు ముగిసినట్లు అయింది. ఇక పురుషుల సింగిల్స్‌లో మాత్రం కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్‌లో హాంకాంగ్‌కు చెందిన హు యున్‌పై 21-12, 21-11తో గెలిచి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు.
కేవలం 29 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. మరోవైపు ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన హు జెన్ హావోపై 21-16, 23-21తో గెలిచాడు. క్వార్టర్స్‌లో ప్రణయ్.. రెండో సీడ్ షి యుకితో తలపడనుండగా, శ్రీకాంత్ మూడో సీడ్ విక్టర్ అలెక్సన్‌తో తలపడనున్నాడు.