బీజింగ్: తాను చాలా తప్పులు చేశానని, ప్రత్యర్థి నుంచి వస్తున్న షటిల్ ను సరిగా అంచనా వేయలేకపోయానని సైనా నెహ్వాల్ అన్నది. ఇండోనేషయా క్రీడాకారిణి చేతుల్లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి విలేకరులతో మాట్లాడింది. మూడో గేమ్ లో పూర్తిగా అలసిపోయానని ఆమె చెప్పింది. మూడో గేమ్ లో సైడ్స్ మారిన తర్వాత డ్రిఫ్ట్ ను అంచనా వేయలేకపోయినట్లు ఆమె తెలిపింది. షటిల్ గీత బయట పడుతుందని వదిలేసిన సందర్భాలున్నాయని ఆమె చెప్పింది.
తాను గెలుస్తానని అనుకోలేదని, తాను తన ఆట ఆడుతూ పోయానని, మ్యాచ్ పాయింట్ దాకా వచ్చిన తర్వాత కూడా అయిపోయిందని అనుకోలేమని ఆమె అన్నది. మూడో గేమ్ లో ఆత్మవిశ్వాసం కోల్పోయానని, దాంతో తీవ్రంగా ఆలసిపోయానని, అన్నీ కలిసి ఓటమికి దారి తీసిందని ఆమె చెప్పింది. ఇంత దాకా వచ్చినందుకు సంతోషంగానూ, ఆధిపత్యం వహించి కూడా ఓడిపోయానని, నిజానికి ఈ మ్యాచ్ తనదేనని, తాను గెలవాల్సిందని ఆమె అన్నది. తొలి రెండు గేమ్ ల్లో సైనా అలసిపోయి ఉంటుందని, దాంతో టెంపోను కొనసాగించలేకపోయిందని సైనా ప్రత్యర్థి ఇండోనేషియా క్రీడాకారిణి క్రిస్టినా అన్నది. అన్ని వేళలా సైనా దాడి చేసిందని, తాను ఓపిక పట్టాల్సి వచ్చిందని ఆమె అన్నది.