న్యూఢిల్లీ: ఇండియన్ డబుల్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా (31) ఆసియా గేమ్స్ నుండి వైదొలగింది. కుడి మోకాలి నొప్పి వేధిస్తుండటంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలి వైద్యులు సూచించడంతో జ్వూలా గుత్తా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ నుంచి వైదొలగక తప్పలేదన్నారు.
ఈ విషయంపై జ్వాలా గుత్తా మాట్లాడుతూ "ఆసియా గేమ్స్ కోసం శిక్షణ ప్రారంభించాక మోకాలి నొప్పి ప్రారంభమైంది. డాక్టర్లను కలిస్తే 10-12 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. ఇలాంటి పరిస్దితుల్లో, తప్పుకోవడం మినహా మరో మార్గం కనిపించలేదు. బాధగా ఉంది, నా కెరీర్లో గాయం కారణంగా ఓ టోర్నీ నుండి ఇంతకమునుపెన్నడూ తప్పుకోలేదు" అని అన్నారు.

జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప ఇద్దరూ డబుల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో 2010 కామన్ వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలవగా, 2014లో వెండి పతకాలను గెలుచుకున్నారు. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు దక్షిణకొరియాలోని ఇంచియాన్ వేదికగా జరగనున్నాయి.
ఈసారి ఆసియా గేమ్స్‌లో పాల్గోనబోయే భారతీయల సంఖ్య 679 మంది. ఇందులో 516 మంది అథ్లెట్లు, 163 మంది సహాయ సిబ్బంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సంప్రదించిన అనంతరం క్రీడల మంత్రి సోనోవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో టోర్నీలో భారత్ 35 క్రీడల్లో పోటీ పడగా.. ఈసారి 28కే పరిమితం చేశారు.