
ప్రతిష్టాత్మక ఇండోనేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిని చవిచూసింది. తనను ఎప్పుడూ వేధించే ఫైనల్ ఫోబియాతోనే మరోసారి టైటిల్ అందుకోలేకపోయింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సీడ్, జపాన్ షట్లర్ అకానె యమగూచి 21-15, 21-16తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధుపై గెలుపొందింది. రెండు వరుస సెట్లలో యమగూచి పూర్తి ఆధిపత్యం చెలాయించి సింధును బోల్తా కొట్టించింది. దీంతో సీజన్‌లో తొలి టైటిల్ గెలుచుకోవాలని భావించిన సింధుకు నిరాశే ఎదురైంది.
51 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధును యామగుచి చిత్తుచేసింది. రెండు గేముల్లో ఆఖర్లో పాయింట్లు సాధించిన యమగూచి.. సింధుపై ఒత్తిడి పెంచింది. తొలిగేమ్ ఆరంభంలో యమగూచి అదరగొట్టినా సింధు 11-8తో గట్టి పోటీనిచ్చింది. కానీ.. తర్వాత యమగూచి విజృంభించడంతో సింధు తొలి గేమ్‌ను కోల్పోయింది. రెండో గేమ్‌లోనూ యమగూచి ఆధిపత్యం చెలాయించి వరుస పాయింట్లు సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో యామగుచి,సింధుతో ఉన్న ముఖముఖి రికార్డును 5-10కి మెరుగు పరుచుకుంది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 46 నిమిషాల్లో 21-19, 21-10తో ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో సింధు 21-14, 21-7 తేడాతో స్టార్ ప్లేయర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై వరుస సెట్లలో విజయం సాధించింది. కేవలం 44 నిమిషాల్లోనే సింధు ఈ మ్యాచ్ సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21-14, 17-21, 21-11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. ఫైనల్లో మాత్రం తడబడింది.