
నెల రోజుల పాటు లభించిన విరామ సమయంలో పక్కా ప్రణాళికతో సాధన చేసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. క్వార్టర్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఒకుహరను చిత్తు చేసిన సింధు.. సెమీఫైనల్లో చెన్ యుఫీ (చైనా)ను ఓడించి టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 46 నిమిషాల్లో 21-19, 21-10తో ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10-4తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. అయితే రెండో సెమీఫైనల్లో యామగుచి 21-9, 21-15తో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించింది. ఈ నేపథ్యంలో సింధుకు సవాల్ ఎదురుకానుంది.
ఈయేడాది సింగపూర్, ఇండియా ఓపెన్‌లో సెమీస్‌తోనే సరిపెట్టుకున్న సింధు ఫైనల్ చేరి సత్తాచాటింది. తాజా విజయంతో మూడు ఇండోనేసియా ఓపెన్‌లో భారత్ తరఫున ఫైనల్ చేరిన మూడో ప్లేయర్‌గా సింధు నిలిచింది. గతంలో సైనా నెహ్వాల్ వరుసగా నాలుగు సార్లు (2009, 2010, 2011, 2012) ఫైనల్ చేరి మూడుసార్లు (2009, 2010, 2012) టైటిల్ గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 2017లో విజేతగా నిలిచాడు.