హైదరాబాద్: బాలీవుడ్‌లో బయోపిక్‌ల ఆధారంగా పలు సినిమాల నిర్మాణం జరుగుతోన్న సంగతి తెలిసిందే. క్రీడాకారుల జీవిత చరిత్రలను సినిమాలుగా మలిచేందుకు కొంతమంది దర్శకులు ఆసక్తి చూపుతున్నారు.
తాజాగా బ్యాడ్మింటన్‌లో రికార్డుల దిశగా దూసుకుపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు ఎవరైనా ముందుకు వస్తే నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఎవరు తీస్తారు? ఎన్ని రోజుల్లో తీస్తారనేది ప్రధాన అంశమన్నారు.

అయితే టోర్నమెంట్లకు ఇబ్బందులు లేకుండా షూటింగ్‌కు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. 'ఎస్' అనే అక్షరం తనకు బాగా కలిసి వచ్చిందన్నారు. సానియా మిర్జా, సైనా నెహ్వాల్‌కు పద్మ అవార్డులను అందుకోవడమే అందుకు ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు.
మ్యూజిక్ అంటే ఇష్టమని చెప్పిన పీవీ సింధు, సినిమాలు ఎక్కువగానే చూస్తానని తెలిపారు. రాబోయే టోర్నీల్లో మరింతగా రాణిస్తాననే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం నాడు జరిగిన మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను సింధు గెలుచుకున్నారు.