
టోక్యో: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ టోక్యో ఒలింపిక్స్ 2020 నుంచి నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో సాయిప్రణీత్ 14-21, 14-21 తేడాతో నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ కాల్జౌ చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో సత్తాచాటాని సాయిప్రణీత్.. రెండో గేమ్‌లో దూసుకెళ్లాడు. ఒక దశలో 7-1 లీడ్‌లోకి దూసుకెళ్లిన ప్రణీత్.. తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. గ్రూప్ డిలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఇజ్రాయెల్ ప్లేయర్ జింబర్‌మ్యాన్ చేతిలో ఓడిన ప్రణీత్.. తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.
షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం జరిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్‌లో సింధు విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన ఎన్‌గన్ యితో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-16 తేడాతో వరుస గేమ్స్‌లో గెలిచింది. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకున్న సింధుకు.. రెండో గేమ్‌లో ప్రతిఘటన ఎదురైంది. 14 పాయింట్ల వరకూ సింధు, ఎన్‌గన్ హోరాహోరీగా తలపడ్డారు. పుంజుకున్న సింధు వరుసగా పాయింట్లు సాధించి మ్యాచును సొంతంచేసుకుంది. ప్రిక్వార్టర్స్‌లో బ్లిచ్‌ఫెల్ట్‌తో సింధు తలపడనుంది.
నాకౌట్ దశ సులభమేమీ కాదని పీవీ సింధు తెలిపింది. ప్రిక్వార్టర్స్‌లో బ్లిచ్‌ఫెల్ట్‌తో పోరు కఠినంగానే సాగుతుందని అంచనా వేసింది. నాకౌట్లో అడుగుపెట్టిన సందర్భంగా తెలుగు తేజం మీడియాతో మాట్లాడింది. 'రెండో గేమ్‌లో నా లయ అందుకున్నాను. మ్యాచును ముగించాను. ఆట వేగంగా సాగింది. నేను కొన్ని అనవసర తప్పిదాలు చేశాను. వ్యూహాలు మార్చి పరిస్థితులను నియంత్రించాను. పెద్ద మ్యాచులకు ముందు ఇలాంటి పరీక్షలు అత్యంత కీలకం. తొలి నాకౌట్ మ్యాచ్ అంత సులభమేమీ కాదు. త్వరగా కోలుకొని బలంగా పుంజుకోవాలి. గతంలో ఆమెతో కొన్ని మ్యాచుల్లో తలపడ్డాను. ప్రతి పాయింటు ముఖ్యమే. ప్రత్యర్థి దూకుడుగా ఆడుతుంది కాబట్టి నేనూ అలాగే ఆడాలి' అని సింధు తెలిపింది.