న్యూఢిల్లీ: మంచి ఫాంలో ఉన్న పీవీ సింధు అద్భుత పోరాటంతో ఇండియా ఓపెన్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. క్వార్టర్సులో సహచర ప్లేయర్ సైనా నెహ్వాల్‌ను ఓడించిన సింధు.. సెమీ ఫైనల్లో తనకంటే మెరుగైన ర్యాంగర్ సుంగ్ జి హ్యూన్ (కొరియా)ను ఓడించింది.
శనివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో అయిదోో ర్యాంకర్ సింధు 21-18, 14-21, 21-14తో నాలుగో ర్యాంకర్ హ్యూన్ పైన గెలుపొందింది. గంటా 16 నిమిషాల పాటు సాగిన మ్యాచులో సింధు మెరుగైన ప్రదర్శన కనబర్చింది.

షటిల్‌పై పూర్తి నియంత్రణ, షాట్ల ఎంపికలో వైవిధ్యం, సరైన ప్లేస్‌మెంట్స్, క్రాస్ కోర్ట్ షాట్లు, పదునైన స్మాష్‌లతో సుంగ్‌కు సింధు అడ్డుకట్ట వేసింది. తొలి గేమ్ మొదట్లో వెనుకబడినా 11-9తో ఆధిక్యంలోకి రావడానికి సింధుకు ఎంతోసేపు పట్టలేదు.
అక్కడ్నుంచి అసలు పోరాటం మొదలైంది. మరింత ఆధిక్యం కోసం సింధు.. అంతరం తగ్గించడానికి సుంగ్ గట్టిగా పోరాడారు. ఈ పోటీలో సింధుదే పైచేయి అయింది. సింధు సంధించిన స్మాష్‌కు సుంగ్ దగ్గర జవాబు లేకపోవడంతో తొలి గేమ్ 21-18తో తెలుగు తేజం సొంతమైంది.
రెండో గేమ్‌లో 5-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధును అనవసర తప్పిదాలు దెబ్బతీశాయి. ఇదే అదనుగా సుంగ్ చెలరేగింది. వరుసగా 6 పాయింట్లతో సింధును అధిగమించింది. అదే జోరులో 21-14తో రెండో గేమ్‌ను గెల్చుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు మరోసారి తన పవర్ గేమ్‌ను చూపించింది.
ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్ షాట్లతో విజృంభించింది. తొలి సర్వ్ నుంచే అధిక్యంలో నిలిచిన సింధుకు, సుంగ్‌కు పోటీ 12-10 పాయింట్ల వరకే. ఆ తర్వాత ఆటంతా సింధుదే. ఆమె ఆడిన షాట్లను కాచుకోవడం తప్పితే సుంగ్ దగ్గర సమాధానం లేకపోయింది.
15-11తో ఆధిక్యంలోకి వెళ్ళిన సింధు.. 21-14తో లాంఛనం పూర్తి చేసింది. సుంగ్‌పై తన గెలుపోటముల రికార్డును సింధు 7-4కు మెరుగుపర్చుకుంది. ఆదివారం మూడో ర్యాంకర్ మారిన్‌తో తలపడనున్న సింధుపై ప్రత్యర్థికే మెరుగైన రికార్డుంది. వీళ్లిద్దరూ ఎనిమిది సార్లు తలపడగా.. అయిదింట్లో మారిన్.. మూడింట్లో సింధు నెగ్గింది.