
ఆసియా మిక్స్‌డ్ టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ బిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత బృందం రాణించింది. కజకస్తాన్‌ను ఏకంగా 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత ఇషాన్, తనీషా జోడీ బరిలో దిగింది. వీళ్లిద్దరూ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. వీళ్ల దూకుడైన ఆటకు ప్రత్యర్థి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కజకస్తాన్ జోడీ మక్సుత్, నర్గీజా జోడీ చిత్తుగా ఓడింది. ఇషాన్-తనీషా ఈ మ్యాచ్‌లో 21-5, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు.
ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ ప్రణయ్ బరిలో దిగాడు. అతను కూడా ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. ప్రత్యర్థి పనారిన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన అతను 21-9, 21-11 తేడాతో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత ఆధిక్యం 2-0కు చేరింది. అనంతరం భారత స్టార్ క్రీడాకారిణి, తెలుగు బిడ్డ సింధు కూడా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కజకస్తాన్ క్రీడాకారిణికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి రౌండ్‌లో 21-4 తేడాతో సింధు చేతిలో చిత్తయిన ప్రత్యర్థి.. రెండో రౌండ్‌లో కొంత పోరాడింది. కానీ సింధు సత్తా ముందు నిలవలేకపోయింది. రెండో రౌండ్‌లో కూడా 21-12 తేడాతో ఆమె ఓడింది. వరుసగా రెండు సెట్లు గెలిచిన సింధు ఈ మ్యాచ్‌లో గెలిచింది. దీంతో భారత జట్టు విజయం ఖరారైంది.
అనంతరం జరిగిన మ్యాచ్‌లో గరగ కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్ గౌడ్ జోడీ కూడా రెచ్చిపోయింది. కజకస్తాన్ జోడీ కుల్మతోవ్, నియాజోవ్‌లను వరుస సెట్లలో 21-10, 21-6 తేడాతో ఓడించారు. చివరగా పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ జోడీ కూడా అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థి జోడీ నర్గీజా, ఐషా జుబ్‌బేక్‌ను చిత్తుగా ఓడించింది. వీళ్లిద్దరూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో వరుసగా రెండు రౌండ్లలో నర్గీజా, ఐషా జోడీ ఒక్కసారి కూడా రెండంకెల స్కోరు చెయ్యలేదు. ఈ మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ జోడీ వరుసగా 21-5, 21-7 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో భారత జట్టు 5-0 తేడాతో ఈ మ్యాచ్‌లో కజకస్తాన్‌ను చిత్తుగా ఓడించి, టోర్నీలో ముందంజ వేసింది.