న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చైనా మహిళల సింగిల్స్ ఓపెన్ ఫైనల్లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన పైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి లీ జురుయ్ చేతిలో 12-21, 15-21 తేడాతో సైనా ఓడిపోయింది.

తొలి సెట్ ఆదిలో సైనా 4-1 తో ఆధిక్యం దిశగా కొనసాగినా, ఆ తరువాత అనూహ్యం వెనుకబడి పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో సైనా అనవసర తప్పిదాలు చేయడంతో లీ జురుయ్ 14-9తో ముందంజ వేసింది. కాగా, రెండో సెట్‌లో సైనా పోరాడినా ఫలితం లేకపోయింది.
రెండో గేమ్‌లో సైనా 9-5, 11-6 తో ఆధిక్యంలోకి వెళ్లినా లీ జురుయ్ తిరిగి పుంజుకుంది. వరుసగా బ్రేక్ పాయింట్లను సాధిస్తూ సైనాపై విజయం సాధించింది. టాప్ సీడ్ అయిన సైనా నెహ్వాల్‌ను ఆరో సీడ్ లీ జురుయ్ 39 నిమిషాల్లో ఓడించింది.
సైనా నెహ్వాల్ ఇప్పటివరకు లీ జురుయ్‌తో 11 సార్లు తలపడగా కేవలం మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది.
సైనాకు సీఎం కేసీఆర్ అభినందన
చైనా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సైనా నెహ్వాల్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. భారత స్టార్ షట్లర్‌గా సైనా నెహ్వాల్ ఇప్పటి వరకు చైనా మహిళల సింగిల్స్ ఓపెన్‌లో రెండుసార్లు ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన చైనా ఓపెన్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి జురుయ్ చేతిలో సైనా ఓడిపోయిన సంగతి తెలిసిందే.