ఇండియా ఓపెన్: సైనాపై సింధు పైచేయి (ఫోటోలు)
హైదరాబాద్: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సాధించే దిశగా భారత స్టార్ పీవీ సింధు ఒక అడుగు ముందుకేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో మూడోసీడ్ సింధు 47 నిమిషాల్లో 21-16, 22-20తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్‌పై విజయం సాధించింది.
దీంతో 2014లో సయ్యద్ మోడీ టోర్నీలో సైనా చేతిలో ఎదురైన పరాజయానికి సింధు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఫలితంతో అంతర్జాతీయ స్థాయిలో సింధు, సైనాల మధ్య గెలుపోటముల రికార్డు 1-1తో సమమైంది.ఇండియా ఓపెన్‌లో ఆరోసారి ఆడుతున్న సింధు 2013లో ఏకైకసారి సెమీఫైనల్‌కు చేరింది.
47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పీవీ సింధు సూపర్ స్మాష్‌లతో చెలరేగింది. తొలి గేమ్‌లో పాయింట్ల కోసం ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. తొలుత సైనా కాస్త వ్యూహాత్మకంగా ఆడుతూ 7-5 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో అలవోకగా డ్రాప్ షాట్లు కొడుతూ సింధు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 9-7తో పైచేయి సాధించింది. కానీ వెంటనే పుంజుకున్నట్లు కనిపించింది.
వెంటనే సైనా రెండు పాయింట్లు సాధించి స్కోరును 9-9తో సమం చేసింది. అయితే ఆ తర్వాత పూర్తిగా వెనుకబడింది. ఈ క్రమంలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన మూడోసీడ్ ప్లేయర్ 15-9 ఆధిక్యంలోకి వెళ్లింది. సైనా ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకోవడంతో అప్పటికే సింధు 19-16తో దూసుకుపోయి మరో రెండు పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకుంది.

రెండో గేమ్‌లో ప్రతిఘటన
ఇక రెండో గేమ్‌లో సైనా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. బ్యాక్‌లైన్ గేమ్‌తో సింధుపై బలమైన షాట్లను సంధిస్తూ కట్టడి చేసింది. దీంతో స్కోరు 4-1గా మారింది. తర్వాత సైనా అదే జోరును కొనసాగిస్తూ వరుస పాయింట్లతో హోరెత్తించింది. కానీ సింధు ఒకటి, రెండు పాయింట్లకే పరిమితంకావడంతో ఎక్కడా ప్రత్యర్థి స్కోరును సమం చేయలేకపోయింది. ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా చెమటోడ్చి రావడంతో సైనా దాదాపుగా పైచేయి సాధించినట్లు కనిపించింది.

అనూహ్యంగా పుంచుకున్న సింధు
కానీ గేమ్ చివర్లో సింధు ఊహించిన విధంగా పోరాటం చేస్తూ 19-16 ఆధిక్యంలో ఉన్న సైనాకు వరుసగా మూడు పాయింట్లు నెగ్గింది. దీంతో స్కోరు ఒక్కసారిగా 19-19తో సమమైంది. వెంటనే బలమైన స్మాష్‌తో సైనా ఓ పాయింట్ నెగ్గి తన ఆధిక్యాన్ని 20-19కి పెంచుకుంది. ఈ దశలో సింధు వరుసగా మూడు గేమ్ పాయింట్లను సాధించి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక శనివారం జరిగే సెమీఫైనల్లో రెండో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సింధు తలపడుతుంది.

సెమీస్‌లో సుంగ్ జీ హున్‌తో తలపడనున్న సింధు
సుంగ్ జీ హున్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 6-4తో ఆధిక్యంలో ఉంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21-10, 20-22, 21-14తో మినత్సు మితాని (జపాన్)పై, సుంగ్ జీ హున్ 21-16, 22-20తో ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై, అకానె యామగుచి (జపాన్) 21-13, 11-21, 21-18తో నోజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచారు.

ఆరంభం నుంచి సైనా ఆధిక్యంలోనే ఉంది
రెండో సెమీఫైనల్లో అకానె యామగుచితో కరోలినా మారిన్ ఆడుతుంది. మ్యాచ్ అనంతరం పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ ఇది చాలా మంచి మ్యాచ్. ఆరంభం నుంచి సైనా ఆధిక్యంలోనే కొనసాగింది. కానీ నేను గెలవగలనని నమ్మాను. ఏ దశలోనూ అవకాశం వదులుకోలేదు. సైనా 20-19తో ఆధిక్యంలోకి వెళ్లినపుడు కూడా పుంజుకోగలనన్న నమ్మకంతోనే ఉన్నా అని చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications