
హైదరాబాద్: ఇండియా ఓపెన్ టోర్నీలో భాగంగా ఫైనల్ వరకు దూసుకెళ్లిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికా అమ్మాయి బీవెన్ జంగ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 18-21, 21-11, 20-22 తేడాతో ఆమె ఓటమి చవిచూసింది.
పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తొలి గేమ్ నుంచి ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. తొలి గేమ్‌లో పాయింట్ల ఖాతాను తెరిచిన బీవెన్ ధాటిగా ఆడింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ దూసుకుపోయింది. అయితే 9-9తో స్కోరు సమం చేసిన సింధు ఆపై విజృంభించి ఆడింది. 16 పాయింట్ల వద్ద జంగ్ పుంజుకొని 21-18తో తొలి గేమ్ గెలిచింది.
కీలకమైన రెండో గేమ్‌లో సింధుదే ఆధిపత్యం. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన సింధు 8-2తో ముందుకెళ్లింది. ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్ల సాధించి 18-10తో ఆధిక్యంలో నిలిచింది. చివరికి 21-11తో గేమ్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి గేమ్‌లో ఇద్దరు క్రీడాకారిణులు గొప్పగా ఆడారు. 4-4తో ఆట సమంగా ఉన్నప్పుడు జంగ్ వరుసగా పాయింట్లు సాధించి 9-4తో ముందుకెళ్లింది. ఆ తర్వాత చావో రేవో అన్నట్టు చెరో పాయింటు సాధిస్తూ పోరాడటంతో ఆట 20-20తో సమం అయింది. ఈ దశలో చక్కగా ఆడిన జంగ్ వరుసగా రెండు పాయింట్లు చేసి గేమ్‌ను, టైటిల్‌ను కైవసం చేసుకుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.