హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ తన సొంత గూటికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సైనానే స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించింది. సరిగ్గా మూడేళ్ల కిందట గోపీచంద్‌ను కాదని బెంగళూరు కోచ్ విమల్ కుమార్‌తో జత కట్టిన సైనా ఇప్పుడు శిక్షణ కోసం గోపీచంద్ అకాడమీలో చేరింది.
ఆ టోర్నీ ముగిసిన వెంటనే సైనా హైదరాబాద్ తిరిగొచ్చిన గోపీచంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ప్రారంభించింది. ఇటీవల గ్లాస్గోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన సైనా.. ఆ టోర్నీ సందర్భంగా తొడ కండరాల గాయానికి గురైంది. గాయానికి చికిత్స తీసుకుంటున్న సైనా ప్రస్తుతం స్వస్థలం హైదరాబాద్‌లోనే ఉంది.
గోపీతో కలిసి పనిచేయాలనుకుంటున్న విషయాన్ని ప్రస్తుత కోచ్ విమల్‌కుమార్‌తో చర్చించాననీ, ఇందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారని సైనా పేర్కొన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత తిరిగి గోపీచంద్ అకాడమీలో సైనా చేరడం వెనుక ప్రత్యేక కారణం ఉందా? అంటే అవుననే అంటున్నారు.
ఇండోనేషియా కోచ్ ముల్యో దగ్గర శిక్షణ పొందడం కోసమే సైనా నెహ్వాల్ తిరిగి గోపీచంద్ అకాడమీలో చేరిందని అంటున్నారు. ముల్యోను ఈ ఏడాది ఆరంభంలో భారత సింగిల్స్ జట్టుకు ప్రత్యేక కోచ్‌గా జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) నియమించింది.

ఇతని ఆధ్వర్యంలోనే పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతంతో పాటు ఇండియా ఓపెన్ సూపర్‌సిరీస్ కూడా గెలుచుకుంది. ఇక శ్రీకాంత్ వరుస సూపర్‌సిరీస్ టైటిళ్లు (ఇండోనేసియా, ఆస్ట్రేలియా) గెలవడం, సింగపూర్ ఓపెన్‌తో సాయి ప్రణీత్ కెరీర్‌లో తొలి సూపర్‌సిరీస్ టైటిల్ నెగ్గడంలోనూ ముల్యోదే కీలకపాత్ర అంటున్నారు.
వాస్తవానికి భారత సింగిల్స్ జట్టు ప్రత్యేక కోచ్‌గా ముల్యోకు గోపీచంద్ అకాడమీకి బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) ఎటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉండడం కన్నా, గోపీ అకాడమీలో చేరితే గోపీతోపాటు ముల్యో ఆధ్వర్యంలో మరింత రాటుదేలొచ్చనే అభిప్రాయానికి సైనా వచ్చింది.
దీంతో గోపీచంద్ అకాడమీలో చేరాలని సైనా నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని సైనా బెంగళూరు కోచ్ విమల్ కుమార్ చెప్పాడు. 'ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ముల్యో దగ్గర శిక్షణ పొందడంపై సైనా నా అభిప్రాయం కోరింది. సింగిల్స్ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం కోసం సాయ్ ముల్యోను నియమించింది. అతడు గోపీచంద్ అకాడమీలో తన సేవలు అందిస్తున్నాడు. అతడి దగ్గర శిక్షణ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని సైనాకు చెప్పాను' అని విమల్ అన్నాడు.