
హైదరాబాద్: ఇంకా తన గేమ్ మరింతగా మెరుగవ్వాలని రష్యా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచిన మాజీ జాతీయ ఛాంపియన్ సౌరభ్ వర్మ అన్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కొకి వతనాబె(జపాన్)తో జరిగిన పోరులో సౌరభ్ 19-21, 21-12, 21-17తో విజయం సాధించాడు.
తొలి గేమ్‌లో వతనాబె దూకుడుగా ఆడుతూ ఆధిక్యత సాధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో విరామ సమయానికి 11-5తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత అనూహ్యాంగా పుంజుకున్న సౌరభ్ మరింత దూకుడుగా ఆడినప్పటికీ, ప్రత్యర్థి జోరు పెంచడంతో 19-21తో సౌరభ్ తొలి గేమ్ కోల్పోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత రెండో గేమ్‌లో దూకుడు పెంచిన సౌరభ్ వర్మ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-12, 21-17తో వరుసగా రెండు గేమ్‌లు కైవసం చేసుకొని టైటిల్‌ను దక్కించుకున్నాడు. మ్యాచ్ అనంతరం సౌరభ్ వర్మ మాట్లాడుతూ "నా దృష్టి రాబోయే ఆసియా గేమ్స్‌పై ఉంది. అందుకు తగినట్లుగా సాధన చేస్తున్నా" అని అన్నాడు.
మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ రోహన్ కపూర్- కుహూ గార్గ్ జోడి ఓటమిపాలైంది. ఫైనల్లో వ్లాదిమిర్ ఇవనోవ్(రష్యా)-మిన్ యుంగ్ కిమ్(కొరియా) జోడీతో జరిగిన మ్యాచ్‌లో 19-21, 17-21తో వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయి రన్నరప్‌గా నిలిచింది.