
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్ కోసం అంతా సిద్ధమైంది. డిసెంబర్ 23 నుంచి గువహటి వేదికగా ఈ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హంటర్స్‌కు చెందిన సాయి ప్రణీత్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంలో ఉందని పేర్కొన్నాడు.
గతేడాది సెమీఫైనల్లో ఓడిన హంటర్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తుందని తెలిపాడు. తనతో పాటు లీ హ్యున్, కరోలినా మారిన్, మార్కిస్ కిడో, యియాన్ సియాంగ్‌లతో హంటర్స్ జట్టు పటిష్టంగా ఉందని తెలిపాడు. మూడో సీజన్‌లో అన్ని జట్లూ మెరుగ్గా ఉన్నాయని ప్రణీత్ చెప్పాడు.

టైటిల్ నెగ్గేందుకు తామంతా వంద శాతం ప్రయత్నిస్తామని అన్నాడు. జట్టును ముందుకు నడిపిం చేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని చెప్పాడు. లీగ్‌లో ఈసారి రెండు జట్లు కొత్తగా చేరిన సంగతి తెలిసిందే. కాగా, డిసెంబర్ 24న జరిగే తొలి మ్యాచ్‌లో హంటర్స్, కొత్త జట్టు అయిన నార్త్‌ఈస్ట్ వారియర్స్‌తో తలపడనుంది.
అయితే మూడో సీజన్‌లో మాజీ వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ పాల్గొనే దానిపై సందిగ్ధిత నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై హంటర్స్ యజమాని వీఆర్కే రావు స్పందించారు. గాయం కారణంగా దుబాయ్ వరల్డ్‌సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు గైర్హాజరైన మారిన్ ఈ లీగ్‌లో కచ్చితంగా పాల్గొంటుందని తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.