హైదరాబాద్ : అంచనాల్లేకుండా ఒలింపిక్స్ బరిలో దిగిన పీవీ సింధు ఇండియాకు ఇప్పుడో ఆశాకిరణం. స్వర్ణానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న సింధు.. ఆ ఒక్క అడుగుకు చేరువవడానికి ఎంతగా చెమటోడ్చిందో తెలుసా? పక్కా ప్లానింగ్ తో.. ఒలింపిక్స్ లో మెడల్ సాధించడమే టార్గెట్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన సింధు.. 75 రోజుల ప్రాక్టీస్ సెషన్ లో ఏ ఒక్కనాడు ప్రాక్టీస్ సెషన్ మిస్ అవలేదు. ఇదీ.. లక్ష్యం పట్ల సింధుకు ఉన్న ఏకాగ్రత.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
ముఖ్యంగా.. మునుపటి ఆటతీరుకు, ప్రస్తుత ఆటతీరుకు సింధులో కనిపిస్తోన్న స్పష్టమైన మార్పు ఫిట్ నెస్. ఆ ఫిట్ నెస్ కోసమే సింధు నెలల తరబడి కసరత్తులు చేసింది. కోచ్ గోపీ సలహాలతో.. బలహీనతలపై ఫోకస్ చేస్తూ.. అలుపెరగని ఫిట్ నెస్ సాధించడానికి సింధు పడ్డ శ్రమ అద్వితీయం. గాయం కారణంగా 2015 ఆరంభంలో ఆటకు దూరమైన సింధు.. ఆ తర్వాత 2015 అగస్టులో మళ్లీ రాకెట్ చేతబట్టింది. ఆ క్రమంలో నిరంతరాయంగా తొమ్మిది నెలల పాటు మొత్తం 22 టోర్నీలు ఆడేసింది సింధు.

కానీ ఎక్కడో లోపం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎన్ని మ్యాచ్ లు ఆడుతున్నా..! ఏదో బలహీనత వెంటాడతూనే ఉంది. కోచ్ గోపి కూడా సింధు విషయంలో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పెద్ద పెద్ద మ్యాచుల్లో సైతం కేవలం ఫిట్ నెస్ కారణంగా సింధు మ్యాచ్ లను చేజార్చుకున్న విషయాన్ని గుర్తించారు. మొత్తంగా సింధు ప్లస్.. మైనస్ లను అన్నింటినీ బేరీజు వేసుకుంటూ ఓ కొత్త టైమ్ టేబుల్ రూపొందించారు.
ఆ ప్రకారం.. ఉదయం నాలుగు గంటల నుంచే సింధు కసరత్తులు ప్రారంభమయ్యేవి. ఆ తర్వాత రెండు స్వల్ప విరామాలతో మధ్యాహ్నాం పన్నెండున్నర గంటల వరకు ఏకధాటిగా సింధు కసరత్తులు కొనసాగుతూనే ఉండేవి. ఇదంతా అయిపోయాక సాయంకాలం నుంచి మరో నాలుగు గంటల ప్రత్యేక శిక్షణ. ప్రత్యేక ట్రైయినర్ పర్యవేక్షణలో వెయిట్ ఎక్సర్ సైజులు, రకరకాల కసరత్తులతో ఫిట్ నెస్ లో సింధు రాటు దేలింది. ఇంతటి అకుంటిత దీక్షతో ఒలింపిక్స్ కు సిద్దమయింది కాబట్టే.. ఇవాళ యావత్తు భారతావనిని మురిపించే ముద్దుబిడ్డగా అందరి చేత మన్ననలు అందుకుంటోంది.