
హైదరాబాద్: కోలూన్ వేదికగా జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. టోర్నీలో భాగంగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 18-21, 30-29, 21-18 తేడాతో విజయం సాధించాడు.
వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇద్దరూ వరుసగా పాయింట్లను సాధిస్తూ అబ్బురపరిచారు. రెండో గేమ్‌లో ఈ ఇద్దరూ 30 పాయింట్ల వరకు ఆడటం విశేషం. ఆ తర్వాత శ్రీకాంత్ తన అనుభవాన్ని ఉపయోగించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకున్నాడు.
క్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్ జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటో లేదా థాయ్‌ల్యాండ్ ఆటగాడు కంటాఫోన్ వాంగ్‌చరోన్‌తో తలపడే అవకాశం ఉంది. మరోవైపు భారత్ ఆటగాడు సమీర్ వర్మ మ్యాచ్ ఆడకుండానే క్వార్టర్ ఫైనల్ చేరాడు. తన ప్రత్యర్థి, ఒలింపిక్ విజేత లిన్ డాన్ (చైనా) గాయం కారణంగా తప్పుకున్నాడు.
దీంతో క్వార్టర్స్‌లో సమీర్ వర్మ డెన్మార్క్‌కు చెందిన హన్స్ క్రిస్టియన్ లేదా హాంకాంగ్‌కు లీ చెకూ యూతో తలపడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సైనా నెహ్వాల్, సాయిప్రణీత్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. సైనా నెహ్వాల్ 21-10, 10-21, 19-21తో రెండో సీడ్ అకానె యమగూచి (జపాన్) చేతిలో ఓటిమిపాలైంది.