
హైదరాబాద్: నొజోమి ఒకుహరతో జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో తాను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ పీవీ సింధు చెప్పింది. గత ఆదివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా పీవీ సింధు సరికొత్త రికార్డు నెలకొల్పింది. వరల్డ్ టూర్ ఫైనల్స్ అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ "ఒకుహరతో ఫైనల్లో ఎలాంటి ఒత్తిడి చెందలేదు. స్వేచ్ఛగా ఆడి విజయం సాధించా. ఇప్పుడు అందరికీ నేను సిల్వర్ స్టార్‌ను కాదని చెప్పగలుగుతున్నా" అని చెప్పింది.
అంతేకాదు భారత అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించాలంటే వివిధ విభాగాల నుంచి ముఖ్యంగా ప్రభుత్వం, స్పాన్సర్ల మద్దతు కీలకమని సింధు అభిప్రాయపడింది. "ప్రస్తుతం అథ్లెట్లకు స్పాన్సర్లు అండగా నిలుస్తున్నారు. చాలా మంది క్రీడాకారులకు ఇప్పుడు స్పాన్సర్లు ఉన్నారు" అని సింధు తెలిపింది.
"కానీ, గతంలో మెరుగ్గా ఆడి ఫలితాలు సాధిస్తేనే స్పాన్సర్లు మద్దతుగా నిలిచేవాళ్లు. ఈ రోజుల్లో మాత్రం అథ్లెట్లకు ఆరంభ దశ నుంచే వాళ్ల మద్దతు దొరుకుతోంది. అది చాలా ముఖ్యమైన విషయం. మంచి ప్రదర్శన చేసే క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. టాప్, ఖేలో ఇండియా లాంటి కార్యక్రమాలు ఆటగాళ్లకు భరోసానిస్తున్నాయి" అని సింధు తెలిపింది.
గతేడాది టైటిల్ పోరులో యమగుచి చేతిలో ఒటమితో రన్నరప్‌గా నిలిచిన సింధూ ఈసారి టైటిల్ గెలిచి తన కలను నిజం చేసుకుంది. అంతేకాకదు సింధు ఫైనల్ ఫోబియా ఉందనే అపవాదుని కూడా తొలగించుకుంది. ఈ ఏడాదిలో సింధుకు తొలి టైటిల్ ఇదే కావడం విశేషం.
2018లో ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, థాయిలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్‌ల్లో సింధు ఫైనల్స్‌కు చేరుకున్నా కేవలం రెండో స్థానంతో సరిపెట్టుకుంది. గతంలో భారత్ నుంచి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నిలో 2009లో జ్వాలగుత్తా-వి డిజు జోడీ, 2011లో సైనా నెహ్వాల్ ఫైనల్‌కు అర్హత సాధించారు.
సింధు కూడా గతేడాది ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, వీరంతా టైటిల్ అందుకోవడంలో విఫలం చెందారు. అయితే, సింధు ఆదివారం మాత్రం ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించింది.