హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బషీర్ బాగ్‌లోని ఎల్బీ స్టేడియంలో జ్వాలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె స్టేడియం ప్రాంగణంలో ఉన్న చెత్తను తొలగించారు. జ్వాలాతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. గవర్నర్ నరసింహన్, సానియా మీర్జా, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండుల్కర్, అనిల్ అంబానీ, నాగార్జున, సల్మాన్ ఖాన్, రామ్ తదితరుల పాల్గొన్నారు. హైదరాబాదులోని రాజ్‌భవన్‌లో నాలుగు రోజుల క్రితం (శుక్రవారం) నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. పార పట్టి గడ్డిని తొలగించారు.
గవర్నర్‌తో పాటు కార్యాలయం ముఖ్య కార్యదర్శి నుంచి ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు రాజ్‌భవన్ ఆవరణను శుభ్రం చేశారు. ఇక ప్రతి శనివారం సాయంత్రం 3.30 గంటల నుంచి 5.30 వరకు ఉద్యోగులంతా రాజ్‌భవన్‌లోని 30 ఎకరాలలో ఉన్న భవనాలు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని నిర్ణయించారు.

స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిరుపయోగంగా ఉన్న పరిసరాలను పచ్చదనంతో నింపే కార్యక్రమాలను చేపట్టనున్నారు. పరిసరాలను పచ్చిక బయళ్లు, హెర్బల్ గార్డెన్లు, గ్రీన్‌హౌస్‌లుగా మార్చి అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ రెండు లారీల గార్బేజ్‌ను ఎరువుగా సరఫరా చేయనుంది.
అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ ప్రారంభించిన మోడీ కూడా.. ఆ రోజుతో మాత్రమే ఆగిపోకుండా సమయం వచ్చినప్పుడల్లా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇటీవల మోడీ వారణాసి వచ్చిన విషయం తెలిసిందే. రెండో రోజు వారణాసి పర్యటలో భాగంగా శనివారం ఉదయం గంగానది వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రధాని మొదటగా అస్పీఘాట్ అని పిలిచే దశాశ్వ మేథఘాట్ వద్ద గంగానదికి పూజలు చేసి హారతి ఇచ్చారు. ఆ తర్వాత పార చేతబట్టి ఘాట్‌లోని మట్టిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మరికొందరు స్థానికులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛభారత్‌లో పాల్గొనాలంటూ మరో తొమ్మిది మందికి ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.
వారిలో మొదటగా సమాజ్‌వాది పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ను ఆహ్వానించడం ఆసక్తిని రేపింది. అఖిలేష్‌తో పాటు చిత్రకూటి యూనివర్సిటీ చాన్సలర్ స్వామిరామ్ భద్రాచార్య, ప్రముఖ బోజ్‌పురి నటుడు మనోజ్ తివారి, రచయిత మణిశర్మ, క్రికెటర్లు మహ్మద్ కేఫ్, సురేష్ రైనా, పద్మశ్రీ గ్రహీత ప్రొఫెసర్ దేవీప్రసాద్ ద్వివేది, ప్రముఖ టీవీ కమీడియన్ రాజ్‌శ్రీవాత్సవ, గాయకుడు కైలేష్‌ఖేర్‌లను ప్రధాని మోదీ నామినేట్ చేశారు.