హైదరాబాద్: జాతీయ క్రీడలకు ఎంపిక చేసిన తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టులో తనకు చోటు కల్పించకపోవడంతోపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను కాదని ఒక పశ్చిమ బెంగాల్ క్రీడాకారిణిని ఎంపిక చేశారని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది.
'తెలంగాణ జట్టులో బెంగాలీ ప్లేయర్‌కు స్థానం లభించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన నన్ను ఎందుకు ఎంపిక చేయలేదో ఆశ్చర్యంగా ఉంది. తరుణ్, సిక్కిరెడ్డిలకు కూడా చోటు దక్కలేదంటే అసలు ఎవరు ఆడుతున్నారో అర్థం కావడం లేదు' అని గుత్తా జ్వాల వ్యాఖ్యానించింది.

అంతేగాక 'ఒక బెంగాలీ అమ్మాయి తెలంగాణకు ఆడుతుందా? మేమంతా బతికే ఉన్నాం కదా' అని జ్వాల కాస్త ఘాటుగానే స్పందించింది. జట్టును ఎవరు ఎంపిక చేస్తున్నారో తెలియడం లేదని పేర్కొంది.
కాగా, రాష్ట్ర జట్టును అసలు ఇప్పటి వరకు ప్రకటించనే లేదని తెలంగాణ సంఘం కార్యదర్శి పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా కేరళ జాతీయ క్రీడలకు తెలంగాణ నుంచి ఆటగాళ్లు 8 క్రీడాంశాల్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి 11 క్రీడాంశాల్లో ప్రాతినిథ్యం వహించడం దాదాపు ఖరారైంది.