జర్మన్ ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుకు బిగ్‌షాక్ తగిలింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, మాజీ వరల్డ్ చాంఫియన్ అయిన సింధు సూపర్ 300 టోర్నీ రెండో రౌండ్లోనే నిష్క్రమించి తీవ్రంగా నిరాశపరించింది. అది కూడా ర్యాంకింగ్స్‌లో తన కంటే తక్కువ ర్యాంకులో ఉన్న చైనాకు చెందిన జాంగ్ ఈ మాన్ చేతిలో ఓడడం గమనార్హం. మూడు సెట్ల పాటు సాగిన ఈ పోరులో ఏడో సీడ్ సింధు 14-21 21-15 14-21 తేడాతో జాంగ్ ఈ మాన్ చేతిలో ఓడింది. 55 నిముషాలపాటు సాగిన ఈ పోరులో సింధును ఓడించి జాంగ్ ఈ మాన్ మూడో రౌండుకు చేరుకుంది.
మ్యాచ్ ఆరంభం నుంచే సింధుపై అధిపత్యం చెలాయించిన జాంగ్ చివరి వరకు అదే జోరును కనబరిచి మ్యాచ్‌ను ఎగురేసుకుపోయింది. తొలి సెట్ ఆరంభంలో 5-5 ఇద్దరు సమంగా ఉన్న దశలో జాంగ్ ఈ మాన్ ఒక్క సారిగా విజృంభించింది. వరుసగా 6 పాయింట్లు సాధించి హాఫ్ సెట్ ముగిసే సమయానికి 11-5తో అధిక్యంలో నిలిచింది. సెట్ చివరి వరకు అదే జోరును కొనసాగించి 21-14తో తొలి సెట్‌ను గెలుచుకుంది. ఇక రెండో సెట్లో పుంజుకున్న సింధు సగం టైమ్ ముగిసే సమయానికి 11-10తో స్వల్ప అధిక్యంలో నిలిచింది. అనంతరం అధిక్యాన్ని పెంచిన సింధు చివరి వరకు పట్టు నిలుపుకుని 21-15తో రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. తొలి రెండు సెట్లను చెరోటి గెలవడంతో ఫలితం కోసం మూడో సెట్‌కు వెళ్లాల్సి వచ్చింది.
ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో చైనా క్రీడాకారిణి జాంగ్ ఈ మాన్ సత్తా చాటింది. దీంతో సగం టైమ్ ముగిసే సమయానికి సింధు 8-11తో వెనుకబడింది. అనంతరం కూడా జోరు కొనసాగించిన చైనా క్రీడారిణి చివరకు మూడో సెట్‌ను 21-14తో గెలుచుకుని మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది. దీంతో భారీ అంచనాలతో జర్మన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టక తప్పలేదు. కాగా వచ్చే వారం నుంచి సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది.