పారిస్: ఈ ఏడాది తొలి వరల్డ్ టూర్ టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం వీపీ సింధు ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. అద్భుత ఆటతో మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సింధు 21-15, 21-13 తేడాతో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ మిషెల్లీ లీ (కెనడా)పై సునాయాస విజయం సాధించింది. 44 నిమిషాల పాటు మ్యాచ్ జరుగగా.. సింధు తన ఆధిపత్యం కొనసాగించింది.
సర్వసభ్య సమావేశం.. నేడు గంగూలీ చేతికి బీసీసీఐ పగ్గాలు!!
తొలి గేమ్‌లో ఓ దశలో 2-5తో వెనుకబడ్డ సింధు ఆ తర్వాత పుంజుకుంది. 8-8తో పాయింట్లు సమం అయ్యాక వెనక్కి తిరిగిచూసుకోలేదు. ఓ దశలో వరుసగా ఐదు పాయింట్లు సాధించి 21-15తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ హోరాహోరీగా సాగగా.. సింధు 8-10తో వెనుకబడింది. పుంజుకున్న సింధు వరుసగా ఏడు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్ళింది. అదే ఊపులో 21-13తో ప్రత్యర్థిని మట్టికరిపించింది. రెండో రౌండ్లో 26వ ర్యాంకర్ యే జియామిన్ (సింగపూర్)తో సింధు తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో భారత యువ షట్లర్ శుభాంకర్ డే సంచలన విజయంతో టోర్నీని ఆరంభించాడు. శుభాంకర్ 15-21, 21-14, 21-17తో ప్రపంచ 17వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. గంటా 18 నిమిషాల పాటు పోరాడి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం విడుదలైన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాయి ప్రణీత్ కెరీర్ బెస్ట్ 11వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
మహిళా సాధికారతను, కృషిని చాటే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న 'భారత్ కీ లక్ష్మీ' కార్యక్రమానికి బ్రాండ్ అంబాపిడర్గా పీవీ సింధు ఎంపికయ్యారు. సింధుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోనే కూడా అంబాపిడర్గా ఉన్నారు. మహిళా సాధికారతను ప్రస్ఫుటిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియోను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు సింధు, దీపిక తమ అభిప్రాయాలను పంచుకున్నారు.