
భారత క్రికెటర్‌పై కిడ్నాపింగ్ కేసు నమోదైంది. టీమిండియా అండర్-19 జట్టుకు గతంలో నాయకత్వం వహించిన విజయ్ జోల్‌పై కిడ్నాపింగ్, ఎక్స్‌టార్షన్ కేసులు నమోదయ్యాయి. అతనితోపాటు విజయ్ సోదరుడు విక్రమ్, మరో 18 మందిపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వీటితోపాటు ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా విజయ్‌పై కేసు నమోదైంది. దీంతో విజయ్ సహా మొత్తం ఇరవై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివశించే ఒక క్రిప్టో మేనేజర్‌పై విజయ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై జల్నా పోలీసులు మాట్లాడుతూ.. రెండు వర్గాల నుంచి ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని, వీటిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. విజయ్ అండ్ గ్యాంగ్ తనపై దాడి చేశారని, తనను కిడ్నాప్ చేసి ఒక గదిలో పదిరోజుల పాటు బంధించారని సదరు క్రిప్టో మేనేజర్ ఆరోపించాడు. అదే సమయంలో ఆ మేనేజర్ తమను మోసం చేశాడని, లక్షల సొమ్ము కాజేశాడని విజయ్ కేసు పెట్టాడు.
ఈ కేసుపై విజయ్ తండ్రి భావ్‌సాహెబ్ కూడా స్పందించారు. వృత్తి రీత్యా క్రిమినల్ లాయర్ అయిన ఆయన.. 'మా అబ్బాయిలు సదరు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌కు చెందిన క్రిప్టోకరెన్సీ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. కానీ వాళ్లపై ఇలా కిడ్నాపింగ్ కేసు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు' అని మండిపడ్డారు. తమను సదరు మేనేజర్ మోసం చేశాడని తెలియడంతో విజయ్, విక్రమ్ ఇద్దరూ మరికొందరితో కలిసి పూణే వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి.
అక్కడ ఉండే ఇన్వెస్టిమెంట్ మేనేజర్‌ను ఔరంగాబాద్‌లోని ఒక హోటల్‌లో ఉంచి ఎక్కడకూ వెళ్లనీయలేదట. పది రోజుల తర్వాత జల్నాలోని తమ ఇంటికి తీసుకెళ్లి అక్కడ బంధించారని కేసు నమోదైంది. విజయ్, విక్రమ్ ఇద్దరూ తన కంపెనీలో పెట్టుబడులు పెట్టానని, తాను దగ్గరుండి ఆ లెక్కలన్నీ చూసుకున్నానని మేనేజర్ తెలిపాడు. అతనిపై కూడా విజయ్ బ్రదర్స్ కేసు పెట్టారు. దీనిలో సదరు మేనేజర్ ఇప్పటికే చాలా మందిని ఇలా పెట్టుబడుల పేరుతో మోసం చేశాడని, తమ దగ్గర కూడా లక్షలు కాజేశాడని ఆరోపించారు.