ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ నుంచి ప్రపంచ నంబర్ వన్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. రెండో రౌండ్‌లోనే ఆమె ఓటమిపాలుకావడం అభిమానులను నిరాశ పరచింది.
జపాన్ క్రీడాకారిణి మినాత్సు మితానీ 21-18, 21-13 స్కోరుతో సైనాను వరుస సెట్లలో ఓడించి సంచలనం సృష్టించింది. పురుషుల సింగిల్స్ నుంచి భారత ఆటగాళ్లు హెచ్‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించారు.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్న ప్రణయ్ మొదటి రౌండ్‌లోసు జెన్ హావో (చైనీస్ తైపీ) చేతిలో 21-23, 21-19, 15-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.
కాగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాదీ శ్రీకాంత్‌ను ఇండోనేషియాకు చెందిన టామీ సుగియార్తో 21-15, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
పురుషుల డబుల్స్ విభాగంలో మనూ అత్రి, సుమీత్ రెడ్డి ప్రస్థానం ముగిసింది. వీరిపై లీ షాంగ్ మూ, సయ్ చియా సిన్ జోడీ 21-19, 20-22, 21-19 తేడాతో గెలుపొందింది.