న్యూఢిల్లీ : ఆటన్నాక గెలుపోటములు కామన్. అయితే గెలిచినప్పుడు ఆకాశానికెత్తేసే అభిమానులు, ఓడిపోయినప్పుడు మాత్రం సంయనం కోల్పోయి కామెంట్స్ చేయడం తరుచుగా జరుగుతున్నదే. ఇప్పుడు ఇదే పరిస్థితి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కు ఎదురైంది.
రియో ఒలింపిక్స్ నుంచి సైనా నిష్క్రమించిన నేపథ్యంలో.. బ్యాగ్ సర్దుకుని స్వదేశానికి వచ్చేయాలని ట్విట్టర్ ద్వారా సైనాకు సూచించాడు ఓ నెటిజెన్. అయితే సైనా మాత్రం ఏమాత్రం చిరాకు పడకుండా సమాధానం ఇవ్వడం గమనార్హం. సదరు నెటిజెన్ కు జవాబిస్తూ.. తప్పకుండా అలాగే చేస్తాను, సింధు బాగా ఆడుతోంది.. ఇండియా తప్పకుండా గెలుస్తుంది అంటూ ట్వీట్ చేసింది సైనా.

అయితే అంత ఓపిగ్గా సైనా చేసిన కామెంట్స్ ను చూసిన తర్వాత సదరు నెటిజెన్ లో పశ్చాత్తపం మొదలయినట్టుంది. అందుకే సైనా ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ.. 'బాధపెట్టినందుకు సారీ.. హర్ట్ చేయడానికి ట్వీట్ చేయలేదు, ఇప్పటికీ నేను మీకు పెద్ద అభిమానినే' అంటూ పేర్కొన్నాడు. దీంతో 'నో ప్రాబ్లమ్ మై ఫ్రెండ్.. ఆల్ ది బెస్ట్ టూ యూ' అని రీట్వీట్ చేసింది సైనా.