
హైదరాబాద్: అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23న జరగనున్న తన వివాహ మహోత్సవానికి హాజరుకావాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించారు. తనకు కాబోయే భర్త సుమీత్ రెడ్డితో కలిసి బుధవారం హైదరాబాద్‌లో ఎంపీ కవితను ఆమె నివాసంలో కలిశారు.
వారి పెళ్లి కార్డును ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిరెడ్డి వివాహం ఫిబ్రవరి 23 రాత్రి 8:27 గంటలకు శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్ లో జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆమె కుటుంబ సభ్యులు దగ్గరుండి చూస్తున్నారు.

కోదాడలో జన్మించిన సిక్కీ రెడ్డి భారత బ్యాడ్మింటన్‌లో డబుల్స్ క్రీడాకారిణిగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సిక్కీ రెడ్డి సభ్యురాలిగా ఉంది. ఇక, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి కాంస్య పతకం కూడా సాధించింది.