కామన్‌వెల్త్ క్రీడలకు మరో తెలుగమ్మాయి రుత్విక

హైదరాబాద్: రోజులు మారాయి... దూసుకొస్తున్న మహిళలు ప్రతి రంగంలోనూ తమదంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బ్యాడ్మింటన్ అనగానే ప్రస్తుతం మనకి గుర్తొచ్చే పేర్లు.. పీవి సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్. వీరితో పాటే మరో తెలుగమ్మాయి రుత్విక శివానీ రాకెట్‌తో రయ్ రయ్ మంటూ దూసుకొస్తోంది. అయితే 2016 దక్షిణాసియా క్రీడల్లో సింధును ఓడించి పసిడి నెగ్గిన ఇరవైయేళ్ల రుత్విక శివాని గురించి పెద్దగా ఎవరికీ తెలీదు.
భారత బ్యాడ్మింటన్‌లో సైనా, సింధుల తర్వాత ఆ స్థాయిలో మహిళల సింగిల్స్‌లో రుత్విక సత్తాచాటుతోంది. చిన్న వయస్సులోనే బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టించి భవిష్యత్తు సింధుగా కితాబులందుకున్న ఆమె కెరీర్ గాయాల కారణంగా అనుకున్నంత గొప్పగా సాగలేదు. అయితే ఫిట్‌నెస్ మెరుగుపరుచుకొని గత కొన్ని రోజులుగా మంచి ప్రదర్శన చేస్తున్న రుత్విక వచ్చే నెల 4న ఆస్ట్రేలియాలో ఆరంభం కానున్న కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పాల్గొనబోతుంది.

ఆటలో దెబ్బలు సర్వ సాధారణం:
ఖమ్మంకు చెందిన రుత్విక ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. అకాడమీలో చేరిన కొన్నిరోజుల్లోనే ఆటలో మంచి ప్రతిభ చూపి కోచ్ గోపీతో ప్రశంసలు కూడా అందుకున్న శివాని కెరీర్ అనుకున్నట్లు సాగలేదు. దానికి కారణం గాయాలు, సమయం కలిసిరాకపోవడం. ఈ ఏడాది ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్స్‌లో హాంకాంగ్‌తో మ్యాచ్‌లో కీలకమైన సింగిల్స్‌లో విజయం సాధించిన శివాని ఆ తర్వాత వెన్నముక గాయంతో మూడు టోర్నీలకు దూరమైంది. ఆటలో గాయాలు సహజం అంటున్న శివాని.. ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకొని ముందుకువెళ్లాలి అని చెబుతోంది.

కొన్ని నెలల పాటు మోకాలి కారణంగా:
‘ఆటలో గాయాలవడం సహజం. అవి మనల్ని మానసికంగా బలంగా తయారుచేస్తాయి. మరింత కృషిచేసేందుకు అవకాశం కల్పిస్తాయి. ప్రతి దాన్ని సానుకూలంగా తీసుకొని ముందుకు వెళ్లాలి' అని శివాని అంటోంది. 2015 జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత జ్వరంతో ఆమె మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2016లో రష్యా ఓపెన్‌లో విజేతగా నిలిచిన తర్వాత ఆమెను మోకాలి నొప్పి వెంటాడింది. దాంతో కొన్ని నెలలు ఆటకు దూరమై అదే ఊపులో మరిన్ని టోర్నీల్లో గెలిచే అవకాశాన్ని కోల్పోయింది.

నా కెరీర్‌లో ఇదే పెద్ద టోర్నీ:
అయినా ఎప్పుడు మనోధైర్యం కోల్పోకుండా పట్టుదలతో శ్రమించి గాయాల నుంచి కోలుకుంది. కామన్వెల్త్ క్రీడలకు ముందు సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించానని ఆమె అంటోంది. ‘కామన్వెల్త్ క్రీడలు ప్రతిష్ఠాత్మకమైనవి. ఇప్పటివరకు పాల్గొనబోతున్న పెద్ద ఈవెంట్ ఇదే. దానికోసం తీవ్రంగా సాధన చేస్తున్నా. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నా.కామన్వెల్త్ క్రీడలు పెద్ద సవాల్'' అని రుత్విక పేర్కొంది.

చిన్నతనం నుంచి విజయాల పరంపరే:
రుత్విక ఐదేళ్ల వయసున్నపుడు తన తండ్రితో పాటు బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్లేది. అలా తనకు ఈ ఆటపై ఆసక్తి కలిగింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ సాయ్‌లో శిక్షణ తీసుకున్న శివాని.. సబ్‌జూనియర్, జూనియర్ విభాగాల్లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత గోపీచంద్ అకాడమీలో చేరడంతో ఆమె ఆటలో మరింత పట్టు సాధించింది. సింధుతో పోల్చడాన్ని భారంగా భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు..‘‘అభిమానులు ప్రతి టోర్నీలోనూ మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటారు. సింధు, సైనా అందరికి ఆదర్శంగా నిలిచారు. వాళ్లే మాకు ప్రేరణ'' అని ఆమె చెప్పింది.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి ఐదు స్థానాల్లో నిలవడమే జీవిత లక్ష్యమంటున్న రుత్విక దానికోసం కష్టపడుతున్నా అని చెప్పిన రుత్విక శివానీ కెరీర్‌లో సాధించిన విజయాలు
* ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్ (2010): మహిళల డబుల్స్ కాంస్యం
* ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్ (2011): సింగిల్స్ రజతం
* ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ (2011): మిక్స్‌డ్ టీమ్ కాంస్యం
* దక్షిణాసియా క్రీడలు (2016): సింగిల్స్ స్వర్ణం, టీమ్ స్వర్ణం
* ఉబర్ కప్ (2016): టీమ్ కాంస్యం
* టాటా ఓపెన్ అంతర్జాతీయ టోర్నీ (2014, 2017)
* బంగ్లాదేశ్ ఓపెన్ (2015)
* రష్యా ఓపెన్ (2016)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications